కోడెల శివప్రసాద్ రావు బయోగ్రఫీ ఇదే...

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:30 IST)
తెదేపా సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఆయన్ను కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే కోడెల మృతిని ఆస్పత్రి వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.
 
మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం. మరోవైపు కోడెల గుండెపోటుతోనే ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.
 
* తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన కోడెల శివ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఎన్నికైన తొలి శాసనసభాపతి. 
* 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు.
* 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. 
* ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. 
* శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.
* కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు. 
* తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబం. 
 
* కోడెల అయిదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివారు. 
* కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదో తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివారు. 
* చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. 
* కోడెల తాతయ్య ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసారు.
* గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్లీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు. 
 
* రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 
* వారణాసిలో ఎం.ఎస్ చదివారు. 
* నరసరావుపేటలో ఆస్పత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు. 
* అనతి కాలంలోనే తిరుగులేని సర్జన్‌గా పేరు తెచ్చుకున్నారు. 
* పల్నాడులో అప్పటికే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచకాలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే సరైన వ్యక్తి అని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. 
 
* ఇష్టం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
* ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ). ముగ్గురు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు