చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. చర్చల్లో ఒక మాట.. చేతల్లో ఒక తీరు కనబరుస్తున్న చైనాకు తగిన సమాధానం చెప్పేందుకు భారత్ భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, బలగాలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బేస్‌ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థలు లడఖ్‌కు చేరుస్తోంది.
అలాగే, చైనా కూడా భారీ సంఖ్యలో సైనిక బలగాలను సరిహద్దుల వద్దకు తరలిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా సైన్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. స్కర్దూ స్థావరంలో ట్యాంకర్ విమానం ఉంచింది. ఇది గాల్లోని యుద్ధవిమానాలకు ఇంధనం అందిస్తుంది.
టిబెట్ వంటి ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి వాటిని తీసుకెళ్లడం క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి పీవోకేను ఇందుకు వినియోగించుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత యేడాదే స్కర్దూ స్థావరాన్ని జే 17 విమానాలకు అనువుగా ఉండేలా పాకిస్థాన్ అభివృద్ధి చేసింది.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే 21 మిగ్ 29, 12 సుఖోయ్‌లు కొనుగోలు చేసేందుకు భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది. ఎల్‌ఏసీ వెంట చైనా యుద్ధవిమానాల కదలికలు పెరిగినట్లు ఇప్పటికే గుర్తించిన భారత్.. సైన్యంతో పాటు వైమానిక దళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది. ఇప్పటికే గాల్వన్ లోయ వద్ద భారత యుద్ధ విమానాలు గస్తీ పెంచాయి.