"వుయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా" - లాక్‌డౌన్ పొడగింపు : ప్రధాని మోడీ

మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (10:27 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలను రక్షించేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే నెల 3వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, ఈ ప్రకటన చేశారు. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఏప్రిల్ 14వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని మరింతగా అడ్డుకునేందుకు వీలుగా ఈ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడగించాయని గుర్తుచేశారు. అందుకే, తాము కూడా అన్నీ ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అందువల్ల మే 3వ తేదీ వరకు దేశ పౌరులంతా కష్టమైన సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
అంతేకాకుండా, కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో "వుయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా" అన్న పదానికి ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయని మోడీ గుర్తు చేశారు. 
 
ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళని చెప్పారు. లాక్‌డౌన్ అమలు ఉండగానే ఉగాది నుంచి విశూ వరకు పండుగలు సాదా సీదాగా జరుపుకున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా, లాక్‌డౌన్ పొడగింపు వల్ల ఆర్థికంగా దేశానికి నష్టమైనప్పటికీ.. ప్రజల ప్రాణాల ముందు ఇవేమి ముఖ్యంకాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. 
 
అందువల్ల మే 3 వరకు దేశ పౌరులు అందరూ సహకరించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. పరిస్థితులు చేజారిపోయే వరకు చూస్తూ ఊరుకోవద్దని ఆయన చెప్పారు. 
 
ప్రస్తుతం ఇతర దేశాలతో పోల్చితే మన దేశం ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 100 లోపు కరోనా కేసులు నమోదుకాగానే విదేశాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేయడం ప్రారంభించామనీ, కేసులు 500లోపు నమోదుకాగానే లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చామని, అందువల్లే మన దేశంలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు