మరోవైపు, శివసేనకు ఇచ్చిన గడువు ముగియడంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఎన్సీపీకి ఆహ్వానించారు. ఈ పార్టీకి కూడా మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు గడువు విధించారు. ఈ లోపు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం ఉన్నట్టు నిరూపిస్తూ లిఖితపూర్వకంగా గవర్నర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంది. ఈ పార్టీ కూడా విఫలమైనపక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం రాత్రి 8:30లోగ తుది నిర్ణయం తెలపాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఎన్సీపీకి గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలుస్తోంది. దీనిపై మంగళవారం ఎన్సీపీకి ఇచ్చిన గడువు వరకు వేచి చూసే అవకాశం ఉంది. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ కూడా నో చెబితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తోంది.