చీటికిమాటికి మాట మార్చం... ప్రతిపక్షంలో కూర్చుంటాం : కాంగ్రెస్

సోమవారం, 11 నవంబరు 2019 (13:02 IST)
మహారాష్ట్ర ఓటర్లు తమను ప్రతిపక్షంలో కూర్చోవాలని తీర్పునిచ్చారని, అందువల్ల ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అంతేకానీ, చీటికిమాటికి మాట మార్చబోమని ఆ పార్టీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఖర్గే స్పందిస్తూ, తాము చీటికి మాటికి మాట మార్చమని, ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పునిచ్చారని, ఈ తీర్పును తాము గౌరవిస్తూ ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. 
 
రాజస్థాన్‌లోని జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌కు వెళ్లిన ఆయన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించింది. దీంతో శివసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపుతోంది. ఇందుకోసం ఎన్సీపీ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది. 
 
మరోవైపు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ కూడా తమ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌నాయకులతో ముంబైలో సమావేశమయ్యారు. అనంతరం ఖర్గే వ్యాఖ్యలపై స్పందన ఏంటని కోరగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి అధికార ప్రకటన వచ్చినప్పుడు స్పందిస్తానని జవాబిచ్చారు. 
 
ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ శివసేన తొలుత బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని, ఎన్డీయే నుంచి బయటికి రావాలని, అప్పుడు ఆపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై ఆలోచిస్తామని చెప్పారు. 
 
కాగా, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105, దాని మిత్రపక్షం శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు