పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఉద్యోగానికి ఐపీఎస్ అధికారి రాజీనామా

గురువారం, 12 డిశెంబరు 2019 (12:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు రాజ్యసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. గురువారం లోక్‌సభ కూడా ఆమోదముద్రవేయనుంది. అయితే, ఈ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన పేరు అబ్దుర్ రెహమాన్. 
 
భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనది, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహమాన్‌ ముంబైలో స్పెషల్‌ ఐజీగా పని చేస్తున్నారు. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గురువారం నుంచి విధులకు హాజరు కావడం లేదని రహమాన్‌ తెలిపారు. 
 
మరోవైపు, ఈశాన్య భారతం రగులుతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. ఆందోళనకారుల ఆగ్రహం పెచ్చరిల్లుతోంది. అస్సోం రాష్ట్రం యుద్ధభూమిని తలపిస్తోంది. ఈ బిల్లుకు నిరసనగా బుధవారం వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. 
 
రోడ్లు, రైల్వే ట్రాకులపై టైర్లను వేసి నిప్పంటించారు. ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా అస్సోం, త్రిపురల్లో నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రకటనలున్న బ్యానర్లను, హోర్డింగులను కిందికి లాగి ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల బా ష్పవాయు గోళాలనూ ప్రయోగించారు.
 
అలాగే, పౌరసత్వ సవరణ బిల్లు 2019కి నిరసనగా అస్సోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం రాత్రి ఆందోళనకారులు డులియాజన్‌లోని కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి నివాసంపై దాడి చేశారు. 
 
నిరసనకారుల దాడి కారణంగా మంత్రి నివాసంలోని పలు ఆస్తులు ధ్వంసమైనట్టు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న రామేశ్వర్ తేలి... ప్రస్తుతం దిబ్రుగఢ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు