కేంద్ర రక్షణ మంత్రిగా మనోహర్ పరీకర్ ఉన్నారు. ఆయన ఈ స్కామ్‌కు అడ్డొస్తున్నాడన్న కారణంతోనే రక్షణ మంత్రి నుంచి తొలగించి తిరిగి గోవా ముఖ్యమంత్రిగా పంపించారా? అనే ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది. ఆయన రాఫెల్ స్కాంకు అడ్డుగా ఉన్నాడన్న కారణంగానే ఆయన్ను గోవా ముఖ్యమంత్రిగా పంపించి.. ఈ డీల్‌ను పూర్తి చేసినట్టు సమాచారం. ఇపుడు దేశంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం రచ్చరచ్చ అయింది. దీంతో ఈ డీల్‌పై మనోహర్ పరీకర్ నోరు విప్పుతాడన్న భయం ప్రధాని నరేంద్ర మోడీకి పట్టుకుంది.
నిజానికి గోవా ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఆస్పత్రుల పాలయ్యారు. దాంతో, సీఎం మనోహర్ పరీకర్ సోమవారం వారిని మంత్రి పదవుల నుంచి తొలగించారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. కానీ, స్వయంగా సీఎం పర్రీకర్ కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేన్సర్ చికిత్సకు కొన్ని నెలలపాటు అమెరికా కూడా వెళ్లారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయినా.. సీఎంగా ఆయనే కొనసాగుతున్నారు. పరీకర్‌ను మార్చేది లేదని సోమవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు కూడా.
నిజానికి, సీఎంతో పాటు మంత్రులనూ తొలగించాలని గోవా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయినా మంత్రులను తొలగించారు కానీ సీఎంను టచ్ చేయలేదు. పర్రీకర్‌ను తొలగించకపోవడం వెనక రాఫెల్ స్కాం భయమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి వెనుక బలమైన కారణాలు లేకపోలేదు.
పర్రీకర్ రక్షణమంత్రిగా ఉన్నప్పుడే రాఫెల్ డీల్‌లో నిబంధనలను కేంద్ర సర్కారు ఉల్లంఘించింది. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీలో చర్చించకుండానే పాత ఒప్పందాన్ని రద్దు చేస్తూ, 36 విమానాల కొనుగోలుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాఫెల్ కొత్త డీల్‌పై పారిస్‌లో ప్రధాని మోడీ ప్రకటన చేసినప్పుడు కూడా పరీకర్ అక్కడే ఉన్నారు. కానీ, ఆ విషయం అప్పటి వరకూ పరీకర్‌కు తెలియదని అప్పట్లో కథనాలు వచ్చాయి. అందుకే, రాఫెల్‌పై భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్‌ఏ) ముందు చర్చ జరిగినా.. మాట్లాడకుండా ఆయన మౌనం పాటించినట్లు తెలుస్తోంది.
అదేసమయంలో రాఫెల్ డీల్‌లో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్)ను తొలగించి రిలయన్స్‌ను భాగస్వామిని చేసిన కొద్ది కాలానికే పరీకర్ రక్షణమంత్రిగా తప్పుకొన్నారు. తన స్వరాష్ట్రం గోవా సీఎంగా వెళ్లిపోయారు. అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదని, సంకీర్ణాన్ని నడిపించటానికి పరీకర్ అనుభవం అవసరమని అప్పట్లో బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. కానీ అసలు కారణం ఇపుడు వెలుగులోకి వచ్చింది. రాఫెల్ డీల్ ఫైలును రక్షణ మంత్రిగా పరీకర్ సమగ్రంగా అధ్యయనం చేశారని, విమానాల కొనుగోళ్లపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారని, బహుశా అందుకే ఆయనను రక్షణ మంత్రి పదవి నుంచి తప్పించారని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.