ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానానికి చెల్లుచీటి : ఏపీ కేబినెట్

గురువారం, 17 అక్టోబరు 2019 (16:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ గురువారం ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేసేలా రూపకల్పన చేయనున్నారు.
 
అంతేకాదు రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అంత్యంత పారదర్శక విధానం ద్వారా భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని, ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అంతేకాకుండా, ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదని.. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచన చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇదే అంశంపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు