నిజానికి ఈ కేసులో దోషులుగా తేలిన పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్, అక్షయ్‌లు ఉరిశిక్షలను తప్పించుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని లొసుగులను ఉపయోగించుకుని, తమ శిక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. అలాగే, పదేపదే కోర్టులకు వెళ్లడం, క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను సమర్పించుకోవడం ఇలా కాలయాపన చేస్తూ వచ్చారు.
దీంతో పాటియాలా కోర్టు గతంలో మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ శిక్షలను అమలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు దోషులకు పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు నలుగురు నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే.