కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి దుర్వినియోగం చేసిందంటూ ఆయన మండిపడ్డారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 1975లో దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ ఎమర్జెన్సీని విధించి నేటితో 43 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించాలన్న ఉద్దేశంతో తాము బ్లాక్ డేను పాటించడం లేదని వివరించారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగిందో నేటి యువతకు అవగాహన కల్పించాలనుకుంటున్నట్లు చెప్పారు.
న్యాయవ్యవస్థ తీరును తట్టుకోలేక అభిశంసనకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఎలా వ్యవహరించారో, ఇప్పుడు కాంగ్రెస్ అదే తీరుగా నడుస్తోందని మోడీ ధ్వజమెత్తారు. మాజీ జర్నలిస్టు కుల్దీప్ నాయర్‌ను గౌరవిస్తాను అని, ఎమర్జెన్సీ సమయంలో స్వేచ్ఛ కోసం ఆయన పోరాడారన్నారు. బీజేపీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినా ఆయనకు సెల్యూట్ చేస్తున్నాని చెప్పారు.