సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు

బుధవారం, 7 నవంబరు 2018 (15:25 IST)
దీపావళి పండుగ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. తమిళనాట మంగళవారమే దీపావళి పండుగ జరిపిన నేపథ్యంలో చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు తదితర నగరాల్లో వేకువజామున 5 గంటలకే ప్రజలు టాపాసులు పేల్చడం ప్రారంభించారు. చెన్నై నగరంలో మధ్యాహ్నం కూడా టపాసులు పేల్చారు. రెండు గంటలు మించి టపాసులు పేల్చరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఆ 2 గంటల సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పొచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని ఉత్తర్వులు జారీచేసింది. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 500లకు పైగా నిఘా బృందాలను రంగంలోకి దింపింది. 
 
అయితే రాష్ట్రంలో పలుచోట్ల వేకువజాము 5 గంటల నుంచి 8 గంటల వరకు టపాసులు పేల్చారు. దీంతో తిరునల్వేలిలో ఏడుగురిపై, చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు నగరాలలో 80 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత సమయంలో టపాసులు పేల్చిన సుమారు 200 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పన్నెండేళ్లలోపు బాలురు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు