ఈ మేరకు కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ, ‘వాళ్లు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులా లేకపోతే బెట్టింగ్ రాయుళ్లా? మీకెందుకు ఎమ్మెల్యే టికెట్లు, క్లబ్‌లో కూర్చొని పేకాట ఆడుకోండి. పోలీసులను బెదిరించే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా?’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సభకు హాజరైన అభిమానులు వేసిన ప్రశ్నలకు పవన్ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వైకాపా ఎన్నికల గుర్తుగా ఉన్న ‘ఫ్యాన్’ కు రెక్కలైతే విరగలేదు కానీ అది తిరగడానికి ‘పవర్’ లేదు అని చెప్తూ... పనిలో పనిగా ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవని, ఇది వరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవారని, ఇప్పుడు భుజాన వేసుకుని మోసుకొస్తున్నారంటూ టీడీపీపై కూడా సెటైర్లు వేసేసారు.
ఇంతకీ సైకిల్ తొక్కుకుంటూ రాలేకపోవడానికి గల కారణంగా... కేసీఆర్‌ని పేర్కొనడం ఇక్కడ విశేషం... కేసీఆర్ సదరు సైకిల్ చైన్‌ని ఎప్పుడో తెంచేసారనీ, చైన్ లేకుండా సైకిల్ తొక్కినా కూడా ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.