కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 12వ తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వంటి అగ్రనేతలంతా ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎందుకంటే, బీజేపీ, టీడీపీ తరపున ప్రచారం చేసే అవకాశాలు లేవు. పవన్‌తో కర్ణాటకలోని జేడీఎస్(జనతా దళ్ సెక్యులర్) పార్టీ ఇటీవల సంప్రదింపులు జరిపినట్టు, ఆయనతో ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత కుమారస్వామి ప్రకటించారు.
అయితే, జనసేన నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా, తెలుగు ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో పవన్ ప్రచారం చేస్తారనే ప్రచారం సాగుతోంది.