మరో సంచలనానికి తెరలేపనున్న జియో... కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోన్???

సోమవారం, 19 అక్టోబరు 2020 (09:14 IST)
దేశీయ టెలికాం రంగనాన్ని షేక్ చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. దేశంలో ఉచిత మొబైల్ సేవలను పరిచయం చేసి ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పాటు ప్రభుత్వ టెలికాం కంపెనీని చావుదెబ్బ కొట్టింది. అంతేకాకుండా, దేశ ప్రజలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 
 
అలాగే, అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోను పరిచయం చేసింది. ఇపుడు మరో సంచలనానికి శ్రీకారం చుట్టనుంది. అదేంటంటే.. మరోమారు కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోనును ప్రవేశపెట్టనుంది. ఈ ఫోను ధర కనిష్టంగా రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు ఉండొచ్చని రిలయన్స్ జియో వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బేసిక్ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరిందరినీ తమవైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో 5జీ కారుచౌక స్మార్ట్‌ఫోన్లను అందివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
దేశాన్ని 2జీ రహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఇటీవల ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అందులో భాగంగానే 5జీ చౌక ఫోన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ల కనీస ధర రూ.27 వేలుగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు