బ్రహ్మగారి మాట పొల్లుపోదురా.. కాలజ్ఞానం కల్ల కాదురా... (video)
బుధవారం, 25 మార్చి 2020 (17:54 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు నటించిన చిత్రం "శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర''. ఈ చిత్రం రాకముందు వరకు పోతూలూరి వీరబ్రహ్మం గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ తెలిసినా పెద్దతరం వారికి తెలిసివుండొచ్చు. కానీ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర చిత్రం వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా, ఈ చిత్రంలో పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం మరింత ప్రాచూర్యంలోకి వచ్చింది.
ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. ముఖ్యంగా, "వినరా వినరా ఓ నరుడా బ్రహ్మంగారి మాట పొల్లు పోదురా. కాలజ్ఞానం కల్ల కాదురా, అంతుపొంతు లేని ఆపదలతో దేశం అల్లకల్లోలం అయిపోయేను. తిరుపతి వెంకన్న గుడి నాలుగు రోజులు పూజలే లేక మూతపడేను. తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికీ ఆధారమయ్యేను. అమెరికా దేశాన భూకంపం పుట్టి పట్టణాలకు చేటు తెచ్చేను. తెరమీద బొమ్మలే పరిపాలనలోకి వచ్చి అధికారం చెలాయించేను. యాగంటి బసవయ్య అంతకంతకూ పెరిగి కలియుగాంతమున రంకె వేసేను. వితంతువు అధికారం చెలాయించేను. కులం, మతం పోయేను. వర్ణాంతర వివాహాలు జరిగేను".... ఇలా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఇపుడు అక్షర సత్యమవుతుందని ప్రతి ఒక్కరూ అంటున్నారు.
ఇప్పటికే పోతులూరి చెప్పినట్టుగా అనేక సంఘటనలు జరిగాయని అనేక గ్రామస్థులు వాదిస్తున్నారు. ఇపుడు కరోనా వైరస్ ముప్పును కాడూ పోతులూరి ఆనాడే చెప్పారని గుర్తుచేస్తున్నారు. "ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. లక్షలాది ప్రజలు సచ్చేనయ, కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి కోతుల్లాగా తూగి సచ్చేరయా" అంటూ కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే ఈశాన్య దిక్కున ఉన్న చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ అనే విషపుగాలి లక్షలాది మందికి సోకింది. దీనివల్ల ఇప్పటికే వేలాది మంది మృత్యువాతపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రజలు చెపుతున్నారు. ఈ పరిస్థితులన్నీ కలియుగం అంతానికేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ప్లేగు, కలరా వ్యాధులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఈ వ్యాధులు సోకి వేలాది మంది చనిపోయారు. ఇపుడు కూడా అలాంటి వైరస్ సోకి వేలాది మంది చనిపోతున్నారు. ఇదంతా వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టే జరుగుతున్నదని జనం నమ్ముతున్నారు. అందుకే ఎన్టీ రామారావు నటించిన వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం సినిమాకు గిరాకీ పెరిగింది.
యూట్యూబ్‌లో ఆ సినిమాను జనం విపరీతంగా చూస్తున్నారు. తాజా పరిస్థితిని కాలజ్ఞానంతో పోల్చుకుని చర్చోపచర్చలు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. అచ్చం బ్రహ్మంగారు చెప్పినట్టే జరుతోంది. లేకపోతే ఈ కరోనా ఏంటి, ఎప్పడూ ఊహించని ఈ అంతు చిక్కని వ్యాధి ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు.