సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు లేవంటున్న సినీ నిర్మాత జీవిత రాజశేఖర్‌ను క్యాష్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎలా నియమిస్తారని పీఓడబ్ల్యూ నేత సంధ్య ప్రశ్నించారు. ఇండస్ట్రీలో మంచివాళ్లు తక్కువగా ఉన్నారని, మహిళలను వేధించేవాళ్లే ఎక్కువగా ఉన్నారన్నారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశం కాబోతున్నామని.. ఇండస్ట్రీలో వున్న సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపాలని కోరనున్నట్లు సంధ్య తెలిపారు.
సినీనటి జీవిత పెట్టిన కేసులకు ఎవరూ భయపడరన్నారు. జీవిత మాటలు మహిళలను కించపరిచే రీతిలో ఉన్నాయని, ఆమె భాష మార్చుకోవాలన్నారు. జీవిత రాజశేఖర్ వ్యవహారంపై ఆధారాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. రాజశేఖర్‌ను పల్లెటూరు నుంచి వచ్చిన ఓ అమ్మాయి కలిసిన తీరుపై ఆమె స్పష్టంగా వివరించి చెప్పారు. 30 ఏళ్ల క్రితం తాను బాధితులను మీడియా ముందుకు తీసుకురాలేదు. ఆ అమ్మాయిలను మీడియా ముందుకు తీసుకొచ్చి వారి భవిష్యత్తును దెబ్బతీయడం తనకిష్టం లేదని సంధ్య తెలిపారు.
పనిలో పనిగా తెలుగు సినీ పరిశ్రమపై సంధ్య మండిపడ్డారు. సినీ పరిశ్రమపై నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోందన్నారు. కొత్తవాళ్లు పరిశ్రమలోకి రాకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు. చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరికి సంబంధించిన సినిమాలు మాత్రమే థియేటర్లో ఆడేలా చేస్తున్నారని విమర్శించారు. తెలుగులో ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నా.. పక్క రాష్ట్రాల నుంచి విలన్లను తీసుకొస్తున్నారని కోట శ్రీనివాసరావు ఎన్నోసార్లు ఆవేదనను వ్యక్తం చేశారని సంధ్య గుర్తు చేశారు.