కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్!
ఆదివారం, 31 జనవరి 2021 (08:03 IST)
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రెండు పార్టీలకు అంత అలుసుగా మారిపోయిందనే ఆరోపణలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? భారీ వరాల్లేకపోయినా, విభజన సమయంలో ఇచ్చిన హామీలనైనా కేంద్రం పూర్తిగా నెరవేరుస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూడటం, తీరా బడ్జెట్ చూశాక నిట్టూర్చడం అలవాటుగా మారిపోతుందా అనేది తేలనుంది.
నిజానికి రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు గడిచిపోతున్నా... ఆంధ్రప్రదేశ్ ఇంకా బాలారిష్టాలను దాటలేదు. చేయి పట్టుకుని నడిపించాల్సిన కేంద్రం.... ఇచ్చిన హామీలనే పూర్తిగా నెరవేర్చడంలేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా తమ ఆకాంక్షలు నెరవేరుతాయా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అమలు వంటి డిమాండ్‌లను నెరవేరుస్తుందా? అని మరోసారి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా, ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు, ఎన్ని వేదికలపై మొరపెట్టుకున్నా... కేంద్రం కనికరించడం లేదు. హోదా ప్రకటించే దిశగా ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రత్యేక హోదాతో విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులను, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల్లో సింహభాగం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు వస్తాయి. ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గుతుంది. పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. కొత్త పరిశ్రమలొస్తే.. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
2014-15 నాటికి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు రూ.22,948 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. అంతకాదు రూ.4,117.89 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. దానిలో కూడా రూ.3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మొత్తం నిధుల్ని కేంద్రం మంజూరు చేయాల్సి ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఒకట్రెండు తప్ప పెద్ద పరిశ్రమలు లేవు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా పనులు పూర్తయితే... కొత్త పరిశ్రమలు వస్తాయి. ఆ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. వాటిని వేగంగా పూర్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సి ఉంది.
విభజన చట్టంలో భాగంగా కేంద్రం హామీ ఇచ్చిన సంస్థల్లో గిరిజన యూనివర్శిటీ కూడా ఉంది. దాని ఏర్పాటు దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగూ పడలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదు. ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిపి, పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలి. 2017-18 ధరల సూచీ ఆధారంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లుకు చేరాయి. వాటిని ఆమోదించాలని రాష్ట్రం పదేపదే కేంద్రాన్ని కోరుతున్నా పెద్దగా స్పందన లేదు.