ఐటీ ఉపాధిపై బడ్జెట్ గొడ్డలివేటు: ఇన్ఫోసిస్

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (17:22 IST)
వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఎస్‌టీపీఐ పథకం కింద కొనసాగుతున్న పన్ను మినహాయింపును నిలిపివేయడంతో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన తీవ్రంగా దెబ్బతింటుందని ఇన్ఫోసిస్ ప్రధాన ఆర్థికాంశాల అధికారి వి. బాలకృష్ణన్ శుక్రవారం పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ టాక్స్ హాలిడేను కొనసాగించినట్లయితే బలపడుతున్న రూపాయి, పెరుగుతున్న ఖర్చులు మరియు పడిపోతున్న మార్జిన్లు తాకిడి నుంచి ఐటీ పరిశ్రమకు ఉపశమనం లభిస్తుందని అన్నారు.

పన్ను మినహాయింపు తొలగింపుతో ఐటీ పరిశ్రమలో ఉపాధి కల్పన తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రధానంగా చిన్న కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటాయని వి. బాలకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన రెండు సంవత్సరాలుగా రూపాయి మారకం విలువ పెరుగుదల ప్రభావాన్ని పెద్ద కంపెనీలు వ్యూహాత్మకంగా ఎదుర్కోగలిగాయని, కానీ మార్చి 2009తో ట్యాక్స్ హాలీడే ముగియడం మొత్తం పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు.

మార్చి 2009 తరువాత కూడా ట్యాక్స్ హాలీడేను కొనసాగించాలని బాలకృష్ణన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్యాక్స్ హాలీడేను అందించే ఎస్‌టీపీఐ పథకాన్ని కొనసాగించని పక్షంలో వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో 4,00,000 ఉద్యోగాలు నష్టపోయే అవకాశం ఉందని నాస్కామ్ చేసిన ప్రకటనను బాలకృష్ణన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వెబ్దునియా పై చదవండి