చిదంబరం వార్షిక బడ్జెట్‌ హైలెట్స్..

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (16:39 IST)
అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో ఆర్థిక మంత్రి పి.చిదంబరం 2008-09 వార్షిక పద్దుల చిట్టాను శుక్రవారం విప్పారు. రైతులకు రుణాల మాఫీ, వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు బడ్జెట్‌కు "ఎన్నికల" కళను చేకూర్చాయి. అదేవిధంగా.. విద్యా వైద్య రంగాలకు భారీ కేటాయింపులు భారీగానే కేటాయించారు. వార్షిక బడ్జెట్‌లోని కొన్ని ముఖ్యాంశాలు...

గత మూడేళ్ల యూపీఏ పానలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 8.7%
తాజా ఆర్థిక సర్వేననుసరించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 8.7%
ఉత్పాదకరంగ వృద్ధి రేటు.. 9.4%
సేవల వృద్ధి 10.7%
వ్యవసాయ రంగ వృద్ధి రేటు 2.6%
స్టాక్ మార్కట్ ఒడిదుడుకులను నియంత్రించేందుకు పెట్టుబడులపై ప్రభుత్వ పర్యవేక్షణ.
భారత నిర్మాణ్ పథకానికి రూ.31,280 కోట్లు కేటాయింపు.

వ్యవసాయ రంగం...
2.6% పెరిగిన వృద్ధిరేటు.
కొత్తగా వ్యవసాయ రుణాల మాఫీ పథకం.
యూపీఏ పాలనలో రెట్టింపైన వ్యవసాయ రుణాలు.
రికార్డు స్థాయిలో 219 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల దిగుబడి.
రికార్డు స్థాయిలో (98.04 మిలియన్ టన్నులు) వరి దిగుబడి.
రికార్డు స్థాయిలో (16.7 మిలియన్ టన్నులు) మొక్కజొన్న దిగుబడి.

రుణాల మాఫీ...
కొత్త పథకంతో వ్యవసాయరుణాల మాఫీ, రైతులకు ఉపశమనం. ప్రభుత్వ రంగ, సహకార బ్యాంకులు మార్చి 2007 వరకు పంపిణీ చేసిన రుణాలు ఈ పథకం కిందకు వస్తాయి.
ఒక హెక్టారు వ్యవసాయ భూమిని కలిగిన సన్నకారు రైతులకు, ఒకటి నుంచి రెండు హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగిన చిన్నకారు రైతులకు వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ. ఇతర రైతులకు ఏకకాలంలో సెటిల్‌మెంట్ పథకం వర్తింపు.
ప్రత్యేక ప్యాకేజీలతో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల పునర్‌వ్యవస్థీకరణ. ఆ తరహా రుణాలు సైతం మాఫీ పథకం కిందకు వర్తిస్తాయి. ఈ పథకం జూన్ 30 2008 నుంచి అమలుకు వస్తుంది. కొత్త రుణాలకు రైతులు అర్హులు.
ఈ పథకానికి గాను రూ.60 వేల కోట్ల ప్రభుత్వ కేటాయింపు.
నాలుగు కోట్ల మంది రైతుల ప్రయోజనం.

విద్యారంగం...
రూ.34,400 కేటాయింపుతో 20 శాతం పెంపుదల.
ప్రపంచంలోనే భారీ స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అమలు.
దేశ వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభంకానుంది.
కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయ పథకంతో వేలసంఖ్యలో బాలికలకు ప్రయోజనం.
కొత్తగా 410 కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు.
కొత్తగా ఆదర్శ పాఠశాల పథకం ప్రారంభానికి సన్నాహాలు.
25 జిల్లాల్లో ఐటీఐల ఆధునకీకరణకు రూ.750 కోట్లు.

20 పైచిలుకు వెనుకబడిన జిల్లాల్లో కొత్తగా నవోదయా విద్యాలయాల ఏర్పాటు.
కొత్తగా ఒక లక్ష ఉపకార వేతనాల మంజూరుకు చర్యలు.
అన్ని జిల్లాల్లో నెహ్రూ యువ కేంద్రాలు.
దేశ వ్యాప్తంగా కొత్తగా 16 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు.
ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లలో రాష్ట్రాల్లో ఒకటి చొప్పున మూడు ఐఐటీల ఏర్పాటు.
విజయవాడ, భోపాల్‌లలో ఒక్కొక్కటి చొప్పున రెండు ఆర్కిటెక్చర్ పాఠశాలల ఏర్పాటు.
శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్త ఉపకార వేతన పథకం ప్రారంభం.
రూ.100 కోట్లతో దేశంలోని అన్ని విజ్ఞాన కేంద్రాల బ్రాండ్ బాండ్ ద్వారా అనుసంధానించే విధానంతో జాతీయ విజ్ఞాన నెట్‌వర్క్ నిర్మాణం.

ఆరోగ్యం .. అభివృద్ధి...
15 శాతం వృద్ధితో ఆరోగ్య రంగానికి రూ.16,543 కోట్లు కేటాయింపు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.16 వేల కోట్లు.
దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం విస్తరణ.
46,200 ఆషా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ.
అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.1500 పెంపుదల.
300 పై చిలుకు జిల్లా స్థాయి ఆస్పత్రుల నవీకరణ.
జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకానికి రూ.12,050 కోట్లు.
ఎయిడ్స్ మహమ్మారిని పారదోలేందుకు రూ.990 కోట్లు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో జాతీయ ఆరోగ్య భీమా యోజన ప్రారంభం.
రూ.6 వేల కోట్లకు పెరిగిన ఐసీడీఎస్‌ కేటాయింపు.

ఆదాయపన్ను మినహాయింపు...
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు.
మహిళల ఆదాయపన్ను పరిమితి రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షలకు పెంపు.
వయోవృద్ధుల ఆదాయపన్ను పరిమితి రూ.1.95 లక్షల నుంచి రూ.2.25 లక్షల పెంపు.
కార్పోరేట్ ఆదాయపన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు.

ఇతర రంగాలకు...
గ్రామీణ విద్యుదీకరణకు రూ.5000 కోట్లు.
జాతీయ రహదారులకు రూ.12,066 కోట్లు.
ఐటి మంత్రిత్వ శాఖకు రూ.1680 కోట్లు.
రక్షణ శాఖ కేటాయింపులు... రూ.1,05,600 కోట్లు.
ప్రజాపంపిణీ వ్యవస్థకు రాయితీ రూ32,676 కోట్లు.
జాతీయ పులుల సంరక్షణా ప్రాధికార సంస్థకు రూ.50 కోట్లు.

వెబ్దునియా పై చదవండి