ప్రేమకు అధిపతి మన్మథుడు

WD

హిందూ దేవతలలో ప్రేమకు అధిపతిగా మన్మథుడు ప్రధానంగా ప్రస్తావించబడతాడు. నవయవ్వన దశలో మగవారిని సైతం ముగ్ధులను చేసే సౌందర్యంతో విల్లంబులను చేబూని పూలబాణాలను సంధిస్తున్నట్లు మన్మథుని రేఖాచిత్రాలు మనకు కనిపిస్తుంటాయి. పురాణేతిహాసాలను అనుసరించి చెరుకు గడను విల్లుగాను, తేనేటీగలను వింటి నారిగాను, ఐదు రకాల పుష్పాలతో అలంకరించబడిన బాణాలను మన్మథుడు ధరించి ఉంటాడని చెప్పబడింది. అంతేకాక కోయిల మరియు చిలుకలు కామదేవునిగా పిలవబడే మన్మథుని వెన్నంటి ఉంటాయి.

బ్రహ్మదేవుని కుమారుడుగాను, రుక్మిణీ శ్రీకృష్ణుల సంతానమైన ప్రద్యుమ్నుని మరో అవతారంగాను కామదేవుని జన్మవృత్తాంతానికి సంబంధించిన దృష్టాంతాలు పురాణాలలో కనపడుతున్నాయి. మహాశివుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో పార్వతీ దేవీకి కందర్పుని రూపేణా మన్మథుడు సహకరించాడని కుమారసంభవంలో పేర్కొనబడింది. తపోనిమగ్నుడైన పరమశివుని దీక్షను భగ్నం చేసే క్రమంలో మహాశివునిపై కందర్పుడు పూలబాణాలను సంధిస్తాడు.

పూలబాణాలు తాకినంతనే కళ్లు తెరిచిన బోళాశంకరుడు, తొలి చూపులోనే పార్వతిని వరిస్తాడని కామదేవుని ప్రణాళిక. కానీ అనుకున్నది ఒక్కటి అయితే జరిగింది మరొకటి అన్న తీరుగా తపోభంగంతో ఆగ్రహించిన సదాశివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి అందుండి వెలువడే అగ్నికీలలతో కామదేవుని భస్మీపటలం చేస్తాడు. కన్ను తెరిచీతెరవకముందే మన్మథుడు బూడిదగా మిగిలిపోతాడు.

అనంతరం గౌరీశంకరుల వివాహం జరుగుతుంది. అయితే మన్మథ దహనంతో ప్రపంచంలో ప్రేమానురాగాలు కరవైపోతాయి. సృష్టి కార్యక్రమానికి విఘాతం కలుగుతుంది. పార్వతీదేవి, దేవగణంతోపాటుగా మన్మథుని భార్య రతీదేవీ, మన్మథునికి జీవం పోయవలసిందిగా పరమశివుని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలకు ప్రసన్నుడైన మహాశివుడు బ్రతికిస్తాడు.

సృష్టి చక్రం మరలా తిరగడం ప్రారంభమైంది. అయితే మన్మథుడు కేవలం మానసికమైన రూపాన్ని మాత్రమే పొందుతాడు. దాంతో దైహిక వాంఛలకు ప్రతినిధిగా కాక మానసిక ప్రేమకు నిదర్శనంగా మన్మథుడు ముల్లోకాల పూజలందుకుంటున్నాడు. రంగులు ప్రధాన పోషించే కామదహనం లేదా హోళీ ఉత్సవం ఈ వృత్తాంతం నుంచే ఆవిర్భవించిందని చెప్పబడింది.

వెబ్దునియా పై చదవండి