మీ స్వీట్‌హార్ట్ ఇచ్చిన గులాబీలతో నిద్రపోండి

WD
హాయ్ కపుల్స్.... వాలెంటైన్ డే వచ్చేసింది. ప్రేయసీ ప్రియులు తమ మనసులోని తీయని భావాలను మాలలుగా చేసి గులాబీ రేకులలో దాచి తమ స్వీట్ హార్ట్ కి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. కొంతమందైతే ఈసరికే ఇచ్చేశారు కూడా. అన్నట్లు మీ ప్రేయసీ ప్రియులు ఇచ్చిన గులాబీలను మీతోనే ఉంచేసుకోండి. నిద్రపోయేటపుడు ఆ గులాబీలను మీ చెంతనే ఉంటే తీయటి కలలు సొంతమవుతాయట. ఆశ్చర్యపోతున్నారా... ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

నిద్రపోయేటపుడు గులాబీ, మల్లె తదితర పూల గుబాళింపులను ఆస్వాదిస్తే ఇక రాత్రంతా మైమరిపించే స్వప్నలోకంలో విహరిస్తారట. అదే దుర్వాసన కలిగిన వస్తువులను వాసన చూస్తే గ్యారంటీగా చెడ్డకలలే వస్తాయని ఈ స్టడీ సారాంశం.

నిద్రపోయేటప్పుడు మనుషులు ఏ వాసనలను పీలుస్తున్నారు అనే విషయం వారికి నిద్రలో వచ్చే కలలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని ఈ పరిశోధన తెలిపింది. ఈ పరిశోధనలో భాగంగా జర్మనీ పరిశోధకులు ఒక వినూత్న ప్రయోగం చేశారు.

మంచివాసనలు వచ్చే పదార్థాలను దుర్వాసన వచ్చే పదార్ధాలను ఈ పరిశోధనలో వాడారు. నిద్రపోయేటపుడు మనుషులు ఏ వాసనకు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా వారు కనుగొనడానికి ప్రయత్నించారు.

ఈ సర్వేలో పాల్గొన్నవారు నిద్రపోయే సమయంలో వారికి కుళ్లిన కోడిగుడ్ల వాసనను గులాబీల వాసనను దశలవారీగా చూపించారు. వారు నిద్రలేచిన తర్వాత పరిశోధకులు వారి అనుభూతులను నమోదు చేశారు.

అసహ్యాన్ని కలిగించిన లేదా చెడువాసనలు కలలయొక్క ఉద్వేగ స్థితిని వ్యతిరేకంగా ప్రభావితం చేయగా, సంతోషాన్ని కలిగించి వాసనలు లేదా సువాసనలు కలలపై సానుకూల ప్రభావం చూపాయని సర్వేలో తెలిసింది. నిద్రపోతున్నప్పుడు మెదడు పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని కనుగొనడం ఇటీవలే వైద్యపరంగా ఆవిష్కరించబడిందని శాస్త్రజ్ఞులు చెప్పారు.

కాబట్టి. నిద్రపోండి కలలు కనండి కానీ. గులాబీ వంటి సువాసలనలు కలిగించే పూలను వాసన చూస్తూ నిద్రపోండి. కమ్మటి కలలు మీకే సొంతమవుతాయి మరి.

వెబ్దునియా పై చదవండి