మగవారు దారి తప్పుతారు... జాగ్రత్త!!

తూర్పు భాగంలో కట్టడాన్ని నిర్మించి, పై కప్పు వేయకూడదని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ఇలా తూర్పు పై భాగం కప్పబడి ఉంటే ఆ గృహానికి చెందిన మగ సంతానం చెడు అలవాట్లకు గురవుతారని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించినా, నిర్మించకపోయినా... తూర్పు గోడను ఆనుకుని ఉన్న, తూర్పు భాగంలో ఎలాంటి కట్టడమైనా నిర్మించి పై కప్పు వేయడం మాత్రం చేయకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అదేవిధంగా... ఉత్తరపు గోడను ఆనుకుని ఎలాంటి కట్టడమైనా నిర్మించి... దాని మీద కప్పు వేస్తే కూడా తీవ్రపరిణామాలు ఎదుర్కొంటారు. ఇది కుబేర స్థానం కాబట్టి దీనిని కప్పి వుంచటం వల్ల రాబోయే సిరిసంపదలు చేజారిపోతాయి. అందుచేత ధనరాబడి లేక, అష్టకష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

ఇకపోతే... పశ్చిమ గోడను ఆనుకుని ఎలాంటి కట్టడం అయినా అవసరం అనుకుంటే నిర్మించుకోవచ్చు. ఇది వరుణదేవుడి స్థానం కాబట్టి పాడి పంటలకు మేలు చేస్తుంది. ఈ భాగంలో పశువుల శాలలుగానీ, ధాన్యం, పప్పు దినుసులు వంటి వంట సరుకులు నిలువచేసుకునే (స్టోర్ రూమ్స్) గదులను నిర్మిస్తే శుభదాయకం. మంచి ధనాదాయం కలుగుతుంది. అయితే ఈ కట్టడంమీద వేసే పైకప్పు తూర్పు వాలుగా ఉండాలి. లేకపోతే స్త్రీలకు అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదముంది.

అయితే... దక్షిణ భాగంలో ఏదో ఒక కట్టడాన్ని నిర్మించి... పైన కప్పువేసి మూసి వుంచటం తప్పనిసరి. ఇది యమధర్మరాజు స్థానం. దీనివల్ల గృహస్థులకు ఆయురారోగ్య వృద్ధి కలుగుతుంది. కుటుంబం సుఖ శాంతులు కలుగుతాయి. ఆ ఇంటి యజమానురాలికి గౌరవం లభిస్తుంది.

ఇకపోతే... దక్షిణభాగంలో నిర్మించబడిన కట్టడంపై వేసే పై కప్పు తప్పనిసరిగా తూర్పువైపుకుగానీ, ఉత్తరం వైపుకుగానీ వాలుగా వుండాలి. లేకపోతే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.

వెబ్దునియా పై చదవండి