టమోటా కూర ఎలా చేయాలి?

FILE
ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే మీరు చేయాల్సిందల్లా మీ ఆహారంలో టమోటాతో పాటు సోయా ఉత్పత్తులను కలిపి తింటే చాలునని వైద్యులు అంటున్నారు. టమోటాతో, సోయా ఉత్పత్తులు క్యాన్సర్‌ కణితుల తయారీని అడ్డుకుంటాయి. అందుచేత వంటల్లో టమోటాలు చేర్చుకుంటూ వుండాలి. మరి మనం టమోటాతో కూర ఎలా చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు:
టమోటాలు : అర కేజీ
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
ఉల్లిపాయలు : 4.
పచ్చిమిర్చి : 4.
కరివేపాకు : 2 రెబ్బలు.
వెల్లుల్లిపాయ : 1.
జీలకర్ర : 1 స్పూను.
నూనె : 8 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, కారం : తగినంత.

తయారీ విధానం :
దోరగా పండిన టమోటాలను శుభ్రం చేసుకుని ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను ఒలిచి సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్లో కలిపి ఉంచుకోవాలి.

పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి తాలింపు పెట్టాక ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం, టమోటా ముక్కలు కూడా వేసి సన్నని సెగ మీద ఉంచాలి. బాగా మగ్గిన తరువాత కొత్తిమీర సన్నగా తరిగివేసి దించాలి. ఈ టమోటా కూరను అన్నంలోకి వేడి వేడిగా వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి