పోషకాలు పుష్కలం.. కడాయ్ పనీర్ ఎలా చేయాలి?

గురువారం, 11 అక్టోబరు 2018 (10:56 IST)
ప‌నీర్‌లో ఉండే పొటాషియం గుండె జ‌బ్బుల‌ను నియంత్రిస్తుంది. డైట్‌లో ప‌నీర్‌ను చేర్చుకుంటే.. బీపీ అదుపులో వుంటుంది. పనీర్‌లో క్యాల్షియం, ఫాస్పరస్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సంబంధ స‌మ‌స్య‌ల‌ను, దంత‌ సమస్యలను పోగొడుతాయి. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. ప‌నీర్‌లో ఉండే విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముక‌లు దృఢంగా ఎదిగేలా చేస్తుంది. 
 
పనీర్‌ను తీసుకుంటే.. కీళ్ల నొప్పులు పోతాయి. పిల్ల‌ల‌కు ప‌నీర్ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఎదుగుతున్న పిల్ల‌ల‌కు మంచి ఆహారంగా పనీర్ ఉప‌యోగప‌డుతుంది. అంతేకాదు, పిల్ల‌ల‌కు చ‌క్క‌ని పోష‌ణ ల‌భిస్తుంది. అలాంటి పనీర్‌తో కడాయ్ పనీర్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
పనీర్ - 200 గ్రాములు 
బటర్ - 50 గ్రా; ఉల్లిపాయ పేస్ట్ -200 గ్రా
పంచదార - అర టీ స్పూను
రెడ్ కలర్ - రెండు చుక్కలు
ఉప్పు - తగినంత; నీరు - కొద్దిగా
మిరప్పొడి - టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా
జీరాపొడి - అర టీ స్పూను
జీడిపప్పు పేస్ట్ - 10 గ్రా 
టొమాటో పేస్ట్ - అరకప్పు 
పసుపు - అర టీ స్పూను
మెంతిపొడి - అర టీ స్పూను
నూనె - టీ స్పూను. 
 
తయారీ విధానం: ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత అదే బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి దోరగా వేయించాలి. 
 
గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. 
 
గ్రేవీలా అయ్యాక.. ముందుగా వేయించిన పనీర్ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కాసేపయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి. కడాయ్ పనీర్ రెడీ.. ఈ గ్రేవీని రోటీలకు సైడిష్‌గా ఉపయోగించుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు