చపాతీలకు బెస్ట్ కాంబినేషన్ - మష్రూమ్ మసాలా ఎలా చేయాలో తెలుసా?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:59 IST)
మష్రూమ్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. మష్రూమ్‌లో సెలీనియమ్, యాంటియాక్సిడెంట్ మినరల్స్, కాపర్, నియాసిన్, పొటాషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ సీ, ఐరన్ కూడా దాగివున్నాయి. మష్రూమ్స్‌ను బాగా ఉడికించి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
కావలసిన పదార్థాలు : 
మష్రూమ్స్ - అర కేజీ 
మొక్కజొన్న పిండి - అర కప్పు 
ఉల్లి తరుగు - రెండు కప్పులు 
టమోటా తరుగు - రెండు కప్పులు
కొబ్బరి తురుము - పావు కప్పు 
పచ్చిమిర్చి - నాలుగు 
మిరప పొడి - ఒక టీ స్పూన్ 
పసుపు పొడి - ఒక టీ స్పూన్ 
గరం మసాలా - ఒక టీ స్పూన్ 
ధనియాల పొడి - ఒక టీ స్పూన్ 
అల్లం- వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు 
ఉప్పు, నూనె- తగినంత 
 
తయారీ విధానం :  
ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్‌ ముక్కలకు అర స్పూన్ పసుపు, మిర్చి, గరం మసాలా, మొక్కజొన్న పిండి, ఉప్పు చేర్చి నానబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక మసాలా పట్టించిన మష్రూమ్ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లి, టమోటా తరుగును చేర్చి దోరగా వేపాలి. ఆపై పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, గసగసాల పేస్టును అందులో కలపాలి.

ఆపై గరం మసాలా, ధనియాల పొడి, పసుపు పొడి చేర్చి బాగా వేపుకోవాలి. మిశ్రమం బాగా వేగాక.. ఫ్రై చేసుకున్న మష్రూమ్‌ను చేర్చి ఐదు నిమిషాల పాటు ఉంచి ఉప్పు చేర్చి దించేయాలి. అంతే మష్రూమ్ మసాలా రెడీ అయినట్లే. ఈ మష్రూమ్ మసాలా చపాతీలకు సైడిష్‌గా టేస్ట్ అదిరిపోద్ది.

వెబ్దునియా పై చదవండి