ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉదయం మేల్కొనప్పటి నుంచి ఉరుకులు పరుగులే. దీంతో ఉదయం పూట తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ తేలికగా అరిగేదిగాను, ఎక్కువ శక్తినిచ్చేదై ఉండాలి. అంతేకాదండోయ్ ఆ టిఫిన్ త్వరగా తయారు చేయగలిగే విధంగానూ ఉండాలి. ఇలా అన్ని విధాలా అనువైనది ఓట్స్. క్షణాల్లో తయారయ్యే ఓట్స్ ఉప్మా మీకు టైమ్‌ను ఆదా చేయడమే కాకుండా మంచి శక్తిని ఇస్తుంది. రుచికరమైన ఓట్స్ ఉప్మా తయారుచేయండి ఇలా.
కావలసిన పదార్థాలు :
ఓట్స్ - 2 కప్పులు, నూనె - 3 టీస్పూన్లు, పసుపు - 1 టీస్పూన్, మినప్పప్పు - 1 టీస్పూను, ఆవాలు - 1 టీస్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, ఉల్లి ముక్కలు - అర కప్పు, క్యారెట్ ముక్కలు - అర కప్పు, బఠాణీ - పావు కప్పు, చక్కెర - 1 టీస్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కట్ట.
తయారీ విధానం :
మొదట స్టౌ మీద పాన్ పెట్టి, అది వేడయ్యాక అందులో ఒక టీస్పూన్ నూనె వేసి కాగాక ఓట్స్, పసుపు వేసి, మీడియం ప్లేమ్ మీద 4 నిమిషాలపాటు వేయించాలి. వేగిన ఓట్స్‌ను గిన్నెలోకి తీసి అదే పాన్‌లో మరో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లి ముక్కలు వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్‌ను వేసి, అందులో చక్కెర, ఉప్పు వేసి, బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి మూత మూత పెట్టేయాలి. తర్వాత మరో ఏడు నిమిషాల ఉడికించాలి. ఓట్స్ మెత్తగా ఉడికాక కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన, శక్తినిచ్చే బ్రేక్ ఫాస్ రెడీ. దీన్ని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆరగిస్తారు.