ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర పప్పు ఎలా చేయాలి?

మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:46 IST)
ఆకుకూరల్లో ప్రధానం పాలకూర. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా వుంటాయి. విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. అలాగే ఇందులో పదమూడు రకాల యాంటీఆక్సిడెంట్‌లున్నాయి. అయితే మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే... పాలకూర అనేక పోషకాలను అందిస్తుందని.. దానివల్ల మనిషికి వయసుతో పాటు వచ్చే మతిమరుపు వ్యాధిని దూరం చేస్తుంది.
 
కావలసిన పదార్ధాలు :
కందిపప్పు : ఒక కప్పు 
పాల కూర : చిన్నవి ఐతే రెండు కట్టలు
చుక్క కూర : ఒక కట్ట
పచ్చి మిర్చి : 6-8
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు 
టమోటా : ఒక కప్పు
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
 
పోపు కోసం:
వెల్లుల్లి రెబ్బలు: 4-6
ఎండుమిర్చి : రెండు
ఇంగువ : చిటికెడు
నెయ్యి : రెండు టీ స్పూన్లు 
కరివేపాకు : రెండు రెమ్మలు
జీల కర్ర : ఒక టేబుల్ స్పూన్ 
ఆవాలు : ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా పాలకూరను ముక్కలుగా తరగాలి. తర్వాత పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన ఆకుకూర పప్పులో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి.

తర్వాత చిన్న బాణలిలో నెయ్యి వేసి ఒక నిమిషం తరువాత వెల్లుల్లి రేకులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. చివరగా ఇంగువ కూడా వేసి వేయించి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. అంతే ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర పప్పు రెడీ.

వెబ్దునియా పై చదవండి