న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్ల నేత భైరవీ దేశాయ్

శుక్రవారం, 7 సెప్టెంబరు 2007 (13:29 IST)
న్యూయార్క్‌లో బుధవారం ప్రారంభమైన ట్యాక్సీ డ్రైవర్ల సమ్మెకు భారత సంతతికి చెందిన అమెరికావాసి భైరవీ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. పురుషాధిక్యత హెచ్చుగా ఉండే ట్యాక్సీ రవాణా పరిశ్రమలో భైరవీ దేశాయ్ ఏకైక మహిళగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భైరవీ దేశాయ్ అందించిన గణాంకాలను అనుసరించి న్యూయార్క్ నగరంలో లైసెన్సు కలిగిన ట్యాక్సీ డ్రైవర్లు 45,000 మంది ఉన్నారు. వారిలో 60 శాతం మంది డ్రైవర్లు భారత్, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల నుంచి న్యూయార్క్‌కు వలస వచ్చినవారు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో 1998వ సంవత్సరంలో న్యూయార్క్ ట్యాక్సీ కార్మికుల సంఘాన్ని స్థాపించడంలో భైరవీ దేశాయ్ సఫలీకృతలయ్యారు. అదే సంవత్సరంలో మెరుగైన పని వాతావరణం మరియు ట్యాక్సీ చార్జిలలో పెంపుదలను డిమాండ్ చేస్తూ ట్యాక్సీ డ్రైవర్లు చేపట్టిన సమ్మె విజయవంతమయ్యింది. ఇదిలా ఉండగా ట్యాక్సీలలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) మరియు క్రెడిట్ కార్డు మెషిన్‌ను ఏర్పాటు చేయాలంటూ నగర పాలక వర్గం నిబంధనలను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్యాక్సీ డ్రైవర్లు చేపట్టిన సమ్మె గురువారంతో రెండవ రోజుకు చేరుకుంది.

జీపీఎస్ వ్యవస్థ వలన తమ వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లుతుందని అనేక మంది ట్యాక్సీ డ్రైవర్లు పేర్కొన్నారు. అదే విధంగా క్రెడిట్ కార్డు మెషిన్‌ను ఏర్పాటు చేయడం వలన కార్యకలాపాల రుసుము రూపేణా తమ ఆదాయంలో ఐదు శాతానికి గండి పడే ప్రమాదం ఉన్నదని వారు వాపోతున్నారు. వీటికి అదనంగా ప్రయాణికుల సౌకర్యార్ధం వినోదం, వార్తలు మరియు సమాచార సదుపాయాన్ని కల్పించాలని అధికారులు ఆదేశిస్తున్నారని తెలిపారు. తాము చేపట్టిన సమ్మె నగర జీవితాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తెలియనప్పటికీ, ట్యాక్సీ డ్రైవర్ల డిమాండ్ల సాధనకే భైరవి అంకితమై ఉన్నారు.

భారత దేశంలో జన్మించిన భైరవి పదేళ్ళ వయస్సులో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. అనంతరం న్యూజెర్సీకి సమీపంలోని హారిసన్‌లో ఆమె కుటుంబం స్థిరపడింది. 1994 సంవత్సరంలో మహిళల అధ్యయనం ప్రత్యేక సబ్జెక్టుగా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి భైరవి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. దక్షిణాసియాకు చెందినవారై న్యూయార్క్‌లో స్థిరపడిన "35 సంవత్సరాల వయస్సులోపు వారిలో టాప్ 5లో ఒకరిగా" భైరవి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అంతేకాక సామాన్యులకు న్యాయ సముపార్జనలో ఆమెలోని అసామాన్యమైన పోరాట పటిమకు మెచ్చిన పలు సంస్థలు బైరవిని అనేక పురస్కారాలతో సత్కరించాయి.

ఈ నేపథ్యంలో ట్యాక్సీ కార్మికుల సమస్యల సాధనకు గాను గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వంతో చర్చించాలని తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని భైరవి మీడియాతో అన్నారు. ఈ నేపథ్యంలో అధికారుల నిబంధనలకు తలవంచి సమ్మెను విరమించుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. మా గొంతులు మూగబోవాలని అధికారులు కోరుతున్న ప్రస్తుత సమయంలో మా కారు ఇంజన్‌లు మౌనవ్రతం పాటిస్తున్నాయని భైరవి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి