మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన విధానంబెట్టిదనినా...

Gulzar Ghouse

బుధవారం, 10 మార్చి 2010 (18:34 IST)
FILE
గత పద్నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రాజ్యసభలో ఎట్టకేలకు మార్చి తొమ్మిది(మంగళవారం) 2010న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొన్ని అభ్యంతరాల నడుమ ఆమోదం లభించింది. దీంతో చట్ట సభలలో పాల్గొనేందుకు దేశీయ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించినట్లైంది. అంతకు మునుపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలను ఓ సారి పరిశీలిద్దాం...

1974:
భారతదేశంలోని మహిళలకు దేశీయ రాజకీయాలలో అవకాశాలు కల్పించాలని కేంద్ర విద్య మరియు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ లోక్‌సభలో 1974లో తొలుత గళం విప్పింది. దీనికి ఓ కమిటీని నియమించాలని కూడా సభకు సూచించింది. అప్పట్లో దేశంలోని రాజకీయాలలో మహిళామణుల శాతం చాలా తక్కువగా ఉండింది. దీంతో ప్రాథమికంగా మహిళలకు రాజకీయాలలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆ శాఖ కోరింది. అందునా పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో మహిళలకు స్థానం కల్పించాలని వారికి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని ఆ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

1993:
తదుపరి 1993లో నియోజకవర్గ చట్టాన్ని సవరణ చేసి అధికరణ 73 మరియు 74ననుసరించి మహిళలకు రాజకీయాలలో ముఖ్యంగా పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో పాల్గొనేందుకు మూడోవంతు రిజర్వేషన్‌ను అమలుపరిచారు.

సెప్టెంబరు 12, 1996 :
తొలిసారిగా సెప్టెంబరు 12, 1996న అప్పటి హెచ్‌ డి దేవెగౌడ ప్రభుత్వం 81వ నియోజకవర్గ సవరణ బిల్లుననుసరించి మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పదకొండవ లోక్‌‍సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేవె‌గౌడ ప్రభుత్వం మైనారిటీలోకి పడిపోయింది. దీంతో లోక్‌‍సభ రద్దయ్యింది. దీంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్న సిపిఐ ఎంపి గీతా ముఖర్జీ డిసెంబరు 9, 1996న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓ నివేదికను సమర్పించారు.

జూన్ 26, 1998:
నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును 12వ లోక్‌సభలో 84వ నియోజకవర్గ సవరణ క్రింద జూన్ 26, 1998న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ అంశం కారణంగానే లోక్‌సభలో వాజ్‌పేయి ప్రభుత్వం మైనారిటీలోకి జారుకుంది. దీంతో 12వ లోక్‌సభ రద్దయ్యింది.

నవంబరు 22, 1999:
ఎన్‌డీఏ కూటమి కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో 13వ లోక్‌సభ ఏర్పాటయ్యింది. ఎన్‌డీఏ కూటమి అధికారం చేపట్టడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తిరిగి నవంబరు 22, 1999న 13వ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ఎన్‌డీఏ ప్రభుత్వం పట్టు వదలని విక్రమార్కుడిలా 2002, 2003లో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. కాని బిల్లును పాస్ చేయించుకోలేక పోయింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతున్నప్పటికీ ఎన్‌డీఏ కూటమి సభ్యులు మద్దతు తెలపకపోవడం గమనార్హం.

మే 2004:
యూపీఏ తిరిగి అధికారంలోకి రావడంతో మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగా కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి)క్రింద మే 2004లో బిల్లును పాస్ చేయించేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది.

మే 6, 2008:
మే 6, 2008న మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పరిశీలన నిమిత్తం యూపీఏ ప్రభుత్వం లా అండ్ జస్టీస్ స్టాండింగ్ కమిటీకి పంపించింది.

డిసెంబరు 17, 2009:
స్టాండింగ్ కమిటీ రూపొందించిన తన నివేదికను డిసెంబరు 17, 2009న ఇరు సభల్లోను ప్రవేశపెట్టింది. దీనిని సమాజ్‌వాదీ పార్టీ, జేడీ(యూ), ఆర్‌జేడీ పార్టీలు ఆక్షేపణ తెలిపాయి.

ఫిబ్రవరి 22, 2010:
భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఫిబ్రవరి 22, 2010న లోక్‌‌సభ సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసేందుకు కట్టుబడివుందని అన్నారు.

ఫిబ్రవరి 25, 2010:
కేంద్ర మంత్రివర్గ సహచరులు ఫిబ్రవరి 25, 2010న మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 8, 2010:
కేంద్ర మంత్రివర్గం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడంతో ఆ బిల్లును మార్చి 8, 2010( అంతర్జాతీయ మహిళా దినోత్సవం)న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ పార్టీలు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, బిల్లును పాస్ కానీయకుండా అడ్డుకుని గందరగోళం సృష్టించారు. పైగా యూపీఏ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని కూడా ప్రకటించాయి.

మార్చి 9, 2010:
ఎట్టకేలకు ఎన్నో ఒడిదుడుకుల మధ్య మార్చి 9, 2010న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రాజ్యసభలో 186 మంది సభ్యులు మద్దతు తెలుపగా కేవలం ఒక్కరు మాత్రమే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి