మహిళలూ.. బ్రేక్ ఫాస్ట్ తప్పక తీసుకోండి.. యాక్టివ్‌గా ఉండండి.!
మంగళవారం, 3 మే 2016 (16:45 IST)
సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు క్రమేణా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే, తగిన ఆహారం తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుదలను పూర్తిగా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడు చురుకుగా పని చేసేందుకు అవసరమైన శక్తిని గ్లూకోజ్ మెదడుకు అందజేస్తుంది. పొద్దున్నే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఈ గ్లూకోజ్‌ను అందజేస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్ మానివేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో విధుల నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలకయితే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో బీన్స్, మొలకెత్తిన గింజలు లాంటివి తీసుకునేవారు చాలా చురుకుగా వ్యవహరిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
వీటితోపాటు పాలు కూడా తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇకపోతే, పొద్దున్నే బేకరీలలో తయారైన వస్తువులను తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోవడమే కాకుండా, వీటిలోని క్యాన్సర్ కారకాలు శరీరానికి హాని చేస్తాయి.
అలాగే... మధ్యాహ్న భోజనంలో కోడిగ్రుడ్లను ప్రతిరోజూ తీసుకుంటే చాలామంచిది. కోడిగుడ్డు నుండి మన శరీరం స్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ను తయారు చేసుకుంటుంది. ఎసెటిల్కోలైన్ దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది గనుక శరీరంలో లోపిస్తే ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది.
అంతేగాకుండా న్యూరో ట్రాన్స్‌మీటర్స్ మన మేధో శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పళ్ళు, పచ్చటి కూరలే శరీరాని మిత్రులనే విషయాన్ని ఎన్నడూ మరచిపోవద్దు. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండటమే గాకుండా, పైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది.
అలాగే, పెరుగును కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్లు ఒత్తిడిని తట్టుకునేందుకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. అంతేగాకుండా, న్యూరో ట్రాన్స్‌మీటర్లను ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. పెరుగు మెదడుకే కాక, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీర్ణకోశాన్ని చక్కగా పనిచేసేలా చేస్తుంది. జీవితంలో చురుకుగా ఉంటూ మంచి విజయాలను సొంతం చేసుకోవాలంటే మేధోశక్తి చాలా అవసరం. అలాంటి మేధోశక్తి పైన చెప్పిన ఆహార జాగ్రత్తలను, నియమాలను పాటించడం వల్ల పొందవచ్చు.