ఆ దేశంలో రేప్ చేసినవాడితోనే పెళ్లి... తిరగబడిన స్త్రీ శక్తి
గురువారం, 15 మార్చి 2012 (19:40 IST)
WD
అన్నెం పున్నెం ఎరగని ఒక అమ్మాయిపై ఓ కామాంధుడు కన్నేశాడు. మాటేసి అత్యాచారం చేసాడు. అతని పశువాంఛకు బలయిన అభాగ్యురాలికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఆ కామాంధుడితో ఆ అమ్మాయి అభీష్టానికి విరుద్ధంగా వివాహం చేసేస్తే న్యాయం జరిగిపోతుందా.. అతని తప్పు ఒప్పయిపోతుందా? లేదా కఠినంగా శిక్షించాలా? నిందితుడిని కఠినంగా శిక్షిస్తే ఆ అమ్మాయి పోగొట్టుకున్న కన్యత్వం తిరిగి వస్తుందా? ఆఫ్రికా దేశమయిన మొరాకోలో ఇప్పుడు మహిళా సంఘాల పుణ్యమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇదే తరహా చర్చ జరుగుతోంది.
అమీనా ఫిలాలీ అనే 16 ఏళ్ల బాలికపై ఒక కామాంధుడు అత్యాచారం చేసాడు. నిందితుడిని కఠినంగా శిక్షించి ఆమెకు న్యాయం చేయాల్సిన ఆ దేశపు చట్టం మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఆ కామాంధుడితో ఆ అమ్మాయికి వివాహం చేయాలని చెప్పింది. అతడితో వివాహం ఇష్టం లేదని ఆ అమ్మాయి అందుకు వ్యతిరేకించింది. దాన్ని పట్టించుకోకుండా బంధువులంతా కలిసి బలవంతంగా వివాహ వేదిక దగ్గరకు లాక్కెళ్లి పెళ్లి తంతు నిర్వహించారు.
ఆ సమయంలో పలుమార్లు ఆ అమ్మాయిపై చేయి కూడా చేసుకున్నారు. అసలే ఒకవైపు, కామాంధుడి అఘాయిత్యంతో తేరుకోలేని స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి న్యాయం చేసే పేరిట చట్టం చేతిలో జరిగిన పరాభవమిది. వివాహమయిన తెల్లారే ఆ అమ్మాయి విషం పుచ్చుకుని బలవంతంగా తనువు చాలించింది. తన శరీరాన్నయితే బలవంతంగా ఏమయినా చేయగలరేమోకానీ.. మనసును కాదని చెపుతూ సుదూర తీరాలకు వెళ్లిపోయింది.
ఈ ఘోరం వెలుగులోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి తెరతీసాయి. ఆ దేశ చట్ట ప్రకారం, రేప్ బాధితురాలికి న్యాయం చేయడమంటే, ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తికిచ్చి పెళ్లిచేయడమే. దీన్ని ఆసరా చేసుకుని పలువురు తమకిష్టం వచ్చిన అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆ దేశ చట్టప్రకారం వివాహం చేసుకోవడం మామూలయిపోయింది. అయితే, ఈ సందర్భాల్లో బాధితురాలి మనోభావాలకు, ఆమె ఇష్టాయిష్టాలకు అక్కడ విలువే ఉండదు. ఒక్క మొరాకోలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఇదే తరహా చట్టాలున్నాయి.
భారతదేశంలో అత్యాచార చట్టం వేరుగా ఉన్నప్పటికీ, చట్టంతో పనిలేకుండానే కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడే పేరుతో భారతీయ తల్లిదండ్రులు తమ కూతురుని కామాంధులకే ఇచ్చి వివాహం చేసే సంఘటనలు ఇప్పటికీ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మొరాకోలో గల చట్టాన్ని సవరించి కొత్త చట్టాన్ని తేవాలంటూ ఆయా దేశాల్లో ఎప్పటి నుండో ఉద్యమాలు సాగుతునే ఉన్నాయి. పేస్‌బుక్‌లో కూడా పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరహా చట్టాలను వ్యతిరేకిస్తున్న వారంతా "మేమంతా అమీనా ఫిలాలీ" అనే పేరుతో ఒక ప్రత్యేక పేజీగా ఏర్పడి తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టుకుంటున్నారు. క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వీరికి మద్దతు పెరుగుతోంది.