స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోని ప్రముఖ విద్యావేత్తలంతా ముక్తకంఠంతో ప్రశంసించే అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం. ఇందులో సీటు రావడమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా భారతీయులకు ఆసియా వాసులకు అందని చందమామ.
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోనే కాదు మరో మూడు ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు - హార్వర్డ్ యూనివర్సిటీ, హోస్టన్ యూనివర్సిటీ, కెల్లాంగ్ యూనివర్సిటీల్లో స్వర్గీయ నందమూరి తారకరామారావు ముద్దుల మనవరాలు, బాలయ్యబాబు పెద్ద కూతురు, చంద్రబాబునాయుడు కోడలు బ్రహ్మణికి ఎంబిఎలో సీటు వచ్చింది.
మైక్రోసాఫ్ట్ కంపెనీ సి.ఇ.ఓ. స్టీవ్ బాల్మర్, గూగుల్ కంపెనీ సృష్టికర్త సెర్వేబ్రిగ్, హెచ్‌పి కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్ పాకార్డ్, ప్రముఖ కంపెనీ నైక్ సి.ఇ.ఓ. ఫిలిప్స్ నైట్, సన్ మైక్రో సిస్టమ్ ఛైర్మన్ స్కాట్ మెక్‌మనీ, యాహూ సృష్టికర్తలు జెర్రీ యంగ్, డేవిడ్ ఫైల్ వంటి అత్యంత మేధావులు చదువుకున్న స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరేందుకు శ్రీమతి బ్రహ్మణి నిర్ణయించుకున్నారు.
పేరుమోసిన యూనివర్సిటీలో సీటు దొరకడమే చాలా కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాలుగు టాప్ యూనివర్సిటీల్లో బ్రహ్మణికి ఎంబిఎ సీటు రావడం చాలా గొప్ప విషయంగా పేర్కొనాలి. మహిళలు అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇది తాజా ఉదాహరణ.
ఈ విషయంపై యువరత్న బాలకృష్ణ స్పందిస్తూ - ''మొదట్నుంచీ స్టడీస్‌లో టాప్ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న మా పెద్దమ్మాయి బ్రహ్మణికి కేవలం మెరిట్ మీదే నాలుగు టాప్ యూనివర్సిటీల్లో సీటు రావడం చాలా ఆనందంగా వుంది. ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా పేరు పొందిన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఎ చెయ్యడానికి బ్రహ్మణి నిర్ణయించుకుంది'' అన్నారు.
ఎడ్యుకేషన్‌లో అద్భుతమైన ప్రతిభను చూపిస్తూ ఇటు పుట్టినింటికీ, అటు మెట్టినింటికీ గర్వకారణంగా నిలిచిన బ్రహ్మణిని 'బ్యూటీ విత్ బ్రెయిన్స్' అని అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.