యువ క్రీడాకారిణిలకు స్ఫూర్తి... జిమ్నాస్టిక్ కెరటం అరుణ...
సోమవారం, 30 జూన్ 2014 (13:01 IST)
ఆకాశంలో సగం అంటూ మగవారితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాలలో అగ్రగామిగా నిలుస్తున్న మహిళలు క్రీడారంగంలో కూడా తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తమ సత్తా చాటుతున్నారు. అతివలు అంతంతమాత్రంగా ప్రవేశించే క్రీడారంగంలో చిన్ననాడే ప్రవేశించి అనతి కాలంలోనే అద్భుతమైన ప్రతివా పాటవాలను ప్రదర్శించి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునే దిశగా కృషి చేస్తోంది అరుణ.
ఇంటర్నేషనల్ జిమ్నాస్ట్‌గా పలువురికి పరిచితురాలైన అరుణను పలుకరిస్తే నోటిలో నుండి వచ్చేవి ఆశయాల ఆశలే. ఈ జూన్ నెలలో రాంచీలో జరిగిన సీనియర్ ఇంటర్నేషనల్‌షిప్‌లో ఆల్‌రౌండ్స్‌లో సెకండ్ వచ్చిన అరుణ కామన్వెల్త్‌కు కూడా ఎంపికైంది.
అరుణ చిన్నతనంలోనే ఆమె తండ్రి ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలకు కరాటే అవసరమని భావించారు. ఆమెకు కరాటే నేర్పించేందుకు జాయిన్ చేశారు. అయితే కరాటే మాస్టార్ ఆమెలోని చురుకుదనాన్ని గుర్తించి జిమ్నాస్టిక్‌లో అరుణను ప్రోత్సహించారు.
మొదట్లో జిమ్నాస్టిక్ అంటే ఏంటో తెలియకపోయినా తండ్రి, గురువు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉత్సాహంగా అడుగు ముందుకేసింది అరుణ. జిమ్నాస్టిక్ చాలా చిన్నవయసు నుండే ప్రారంభించాలి అంటే దాదాపు 6, 7 సంవత్సరాల వయసులోనే శిక్షణ ప్రారంభిస్తేనే గానీ జిమ్నాస్టిక్ నేర్చుకోలేరు, ఎందుకంటే ఆ తర్వాత వయసు పెరిగేకొద్దీ జిమ్నాస్టిక్ నేర్చుకునేందుకు శరీరం సహకరించదు. అలాగే 22, 23 సంవత్సరాల వయసు వరకే ఏజ్ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత బాడీ కో ఆపరేట్ చేయదు.
జిమ్నాస్టిక్‌లో 6 ఈవెంట్స్ ఉంటాయి. ఆర్టిస్టిక్, రిథమిక్, ఎక్రోబెతిక్స్, ఎరోబిక్స్ , థమ్లింగ్ అండ్ ట్రాంప్లింగ్. ఈ ఆరు ఈవెంట్స్ వేరువేరుగా ఉంటాయి. ఇందులో అరుణ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్. మళ్ళీ ఇందులో కూడా 4 ఈవెంట్స్ ఉంటాయి. టేబుల్ వరల్డ్, ఈవెన్ బాల్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఇంకా బ్యాలన్సింగ్ బీమ్. ఆల్‌రౌండర్ కావాలంటే అన్నీ క్రమంతప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజూ ఆరు గంటల ప్రాక్టీస్ అవసరం. అయితే కాలేజీకి వెళ్ళడం వల్ల కేవలం మూడు గంటల సమయం మాత్రమే ప్రాక్టీస్ చేయగలుగుతోంది అరుణ. కానీ క్యాంప్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆరు గంటల ప్రాక్టీసు చేసే తీరుతుంది.
తాను జిమ్నాస్టిక్లో అడుగుపెట్టినప్పుడు అరుణకు ఏమీ తెలియదు. దీన్ని ప్రొఫెషనల్‌గా తీసుకుంటానని ఆమె ఏ మాత్రమూ ఊహించలేదు కూడా. అయితే 2005లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మొదటిసారి మెడల్ వచ్చినప్పుడు తనపై తనకు అపారమైన నమ్మకం కలిగింది. ఏదైనా తాను సాధించ గలను అనే ఆత్మవిశ్వాసం ఆమెలో రూపుదిద్దుకుంది. అంతే... రెట్టించిన ఉత్సాహంతో ప్రాక్టీసు చేసింది. కాంపిటీషన్‌లలో పార్టిసిపేట్ చేసింది. ఎన్నో పథకాలను సాధించింది.
2009లో దోహాలో జరిగిన ఫస్ట్ ఇంటర్నేషనల్ వరల్డ్ స్కూల్ గేమ్స్‌లో అరుణ పాల్గొన్నప్పుడు బైట జిమ్నాస్ట్‌లు ఎలా ఉంటారో, ఎలా ప్రాక్టీస్ చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో అనే విషయాలపై అవగాహన పెంచుకుంది అరుణ. గౌహతి నేషనల్ గేమ్స్‌లో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ వచ్చినప్పుడు సిల్వర్ మెడల్ సాధించింది అరుణ. అంతకంటే అత్యంత ఆనందకరమైన విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున 3 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకోవడం తన జీవితంలో మెయిన్ మెరిట్ అంటుంది అరుణ.
బెల్జియం, జపాన్, రష్యా, జార్ఖండ్ ఇలా ఎన్నో చోట్ల పోటీలలో పాల్గొని పతకాలను గెలుపొందింది అరుణ. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఇలా అన్ని లెవెల్స్‌లోనూ చాంపియన్‌షిప్ సాధించింది. స్కాట్‌ల్యాండ్‌లో జూలై 23 నుండి ఆగష్టు 3 వరకు జరిగే కామన్‌వెల్త్ పోటీలకు ఇండియా నుండి సెలెక్ట్ అయిన అరుణ ఇంగ్లాండ్, స్కాట్‌ల్యాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోబోతోంది. అక్కడ ఫైనల్‌లో సెలెక్ట్ కావాలని ఏదో ఒక ఈవెంట్‌లో మెరుగైన ప్రతిభను కనపరచి మెడల్ తెచ్చుకోవాలని ఆశ పడుతోంది అరుణ.
ఇప్పటివరకు సాధించిన పతకాలు, సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలతో సరిపుచ్చుకోలేని అరుణ 2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ చూపించాలని, ఒలంపిక్స్‌లో గెలవడమే తన లక్ష్యం అంటోంది.
సరైన గమ్యం ఉన్నప్పుడే ఆటగాడికి ఆట, వేటగాడికి వేట గురి తప్పకుండా ఉంటుంది. అలాగే అరుణ లక్ష్యం కూడా విలక్షణంగా ఉండి రాబోయే తరాలకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. అరుణ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని, అనుకున్నవి సాధించుకోవాలని మనసారా కోరుకుంటుంది వెబ్దునియా.