పర్యావరణానికి ఊపిరిలూదుతున్న యామిని కోగంటి... పేపరు బ్యాగుల విప్లవం...

బుధవారం, 2 జులై 2014 (14:54 IST)
భగవంతుని సృష్టిలో ఎంతో అందమైనది ప్రకృతి. పచ్చని పంటపొలాలు, చల్లని గాలి, కంటికింపుగా కనిపించే పర్యావరణం, తెల్లని పాలిచ్చే ఆవులు, గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆహ్లాదాన్ని కలిగించే పక్షులు .. ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. కానీ ఆ అందాలన్నింటినీ మింగేసే భూతం ప్లాస్టిక్. ప్లాస్టిక్ వల్ల కలిగే ఎన్నో అనర్థాలను గుర్తించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు యామిని కోగంటి. 
 
ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు 
మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు చేతి సంచులు పట్టుకుని వెళ్ళకపోయినా ఫర్వాలేదు. వ్యాపారులు తమ వద్దకు వచ్చేవారికి క్యారీ బ్యాగ్‌ల్లో వస్తువులు వేసి ఇవ్వడం అలవాటు చేసారు. అందుకే వినియోగదారులు చేతి సంచులు తీసుకువెళ్ళడం దాదాపు మరిచిపోయారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాలయాల్లో ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు వినియోగిస్తున్నారు. వాడకం అనంతరం వీటిని బయట పారవేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే ప్లాస్టిక్ కవర్లలో తీసుకుపోయే పదార్థాలకు ప్రాణ వాయువు అంటే ఆక్సిజన్ అందకపోవటంతో ఆ పదార్థాలు తొందరగా పాడవుతాయి. వాటిని తిన్న వారికి ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. క్యారీబ్యాగ్‌లను ఆవులు, మేకలు వంటి జంతువులు తిని అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నాయి. పాలిథిన్ సంచుల్లో తీసుకువచ్చే వేడి పదార్థాల్లో ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు కలిసిపోయి వాటిని తినే చిన్న పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. అందుకే ప్లాస్టిక్ కవర్లకు అతీతంగా చిన్నచిన్న వస్తువులను వేసుకుని తీసుకుని వెళ్లేందుకు జగీశా పేపర్ బ్యాగ్ పరిశ్రమను స్థాపించారు యామిని కోగంటి. 
 
అన్ని అవసరాలకు.. ఎన్నో సైజుల్లో.. 
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరిగే హాని గురించి పేపర్లో తెలుసుకున్న యామిని పేపర్ బ్యాగ్ పరిశ్రమ ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని, అంతేకాకుండా కొంతమంది మహిళలకైనా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో పరిశ్రమను ప్రారంభించారు యామిని.  2006లో ప్రారంభించిన ఈ పరిశ్రమలో ఒక సంవత్సరం పాటు ప్లెయిన్ బ్యాగ్స్ తయారు చేశారు. అయితే కస్టమర్లు వాటిపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్‌ను పెంచుకోవడం కోసం కొన్ని కొత్త డిజైన్లను ఎడాప్ట్ చేసుకుని డిజైన్ బ్యాగ్స్‌ని తయారు చేయడం ప్రారంభించారు. 
 
కష్టమర్ల అభిరుచే ఈ డిజైన్లకు రూపకల్పన 
వినియోగదారుల అభిరుచే లక్ష్యంగా క్రాఫ్ట్స్ పేపర్ ని ఉపయోగించి బ్యాగ్స్ ని  తయారుచేస్తారు. 3 అంగుళాల సైజు నుండి పదహారున్నర అంగుళాల సైజు వరకు వీరు బ్యాగులను తయారు చేస్తారు. లగ్నపత్రికలు, చిన్నచిన్న గిఫ్టులు, పేరంటానికి వచ్చే ఆడవారి కోసం పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం వంటి వాటిని ప్యాక్ చేసేందుకు వీలుగా ఉండే బ్యాగులతోపాటు అరకేజీ నుండి ఏడు కిలోల బరువును మోయగలిగే బ్యాగులను తయారు చేస్తారు. కేవలం వ్యాపార దృక్పధం మాత్రమే కాకుండా పర్యావరణం గురించి చిన్న పిల్లల ప్రాజెక్ట్ వర్క్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు యామిని.
 
ఇప్పటివరకు దాదాపు 4600 మంది చిన్నారులకు శిక్షణ కూడా ఇచ్చారు. అంతేకాకుండా వినాయక చవితి పండుగ సమయంలో పూజించే విఘ్నేశ్వరుని ప్రతిమను కూడా మట్టితో తయారుచేయడం గురించి చెప్పి అందులో కూడా అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు యామిని. పెద్దపెద్ద హోటల్స్, కార్పొరేట్ కంపెనీలు, బోటిక్‌లు, దుస్తుల దుకాణాలు వారు ఆర్డర్ ఇచ్చి జగీశా వారి నుండి బ్యాగ్స్ తయారుచేయించుకుంటారు. అలాగే వెడ్డింగ్, బర్త్ డే, స్కూల్స్ ఇంకా కాలేజీ పార్టీలకు కూడా స్పెషల్‌గా బ్యాగ్స్ తయారుచేసి సప్లయ్ చేస్తారు యామిని. కస్టమర్ల ఆసక్తి, అభిరుచితో పాటు వారి అవసరానికి అనుగుణంగా బ్యాగ్స్ తయారు చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత.
 
పర్యావరణ పరిరక్షణకోసం.. 
అందం కోసమో, వ్యాపారాభివృద్ధి కోసమో బ్యాగ్స్‌ని లామినేషన్ చేసి, పర్యావరణాన్ని పాడు చేయడం తమ అభిమతం కాదని చెప్పే యామిని పాలిథిన్‌ని పూర్తిగా వాడరు. ప్రస్తుతం వస్త్రాన్ని, కాగితాన్ని కలిపి అందమైన బ్యాగులను అందిస్తున్న తమ సంస్ధ నుండి భవిష్యత్తులో కేవలం వస్త్రం నుంచి మాత్రమే సంచులను ఎక్కువగా తయారుచేయాలని ఆశిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ని తరిమేయాలన్నదే తమ ధ్యేయమనీ, దీనికి ప్రత్యామ్నాయంగా కాగితం, వస్త్రం, జనపనార బ్యాగులను వాడటం, స్టీల్ బాక్స్ లలో తినే పదార్ధాలను పట్టుకెళ్ళడం వంటి పనులను అందరూ అలవాటు చేసుకోవాలని, అప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించ గలుగుతామని అభిప్రాయపడ్డారు.
 
ప్రభుత్వం కూడా ప్రజలలో ప్లాస్టిక్ నిషేధం గురించి పూర్తి అవగాహన కల్పించాలని, పేపర్ బ్యాగ్స్, జ్యూట్ బ్యాగ్స్ వంటి వాటిపై ఆసక్తిని కలిగించాలని, ఈ పరిశ్రమలపై పన్నును కూడా తగ్గిస్తే ముందుముందు ఇలాంటి చిన్న పరిశ్రమలు ఎన్నో ముందుకు వస్తాయని, తద్వారా ప్రజలను ప్లాస్టిక్ భూతం నుండి కాపాడవచ్చని ఆశిస్తున్నారు 
 
ఎవరైనా సరే ఏ రంగంలో అయినా రాణించాలి అనుకుంటే కృషి,పట్టుదలతో పాటు వారి కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా కావాలి. తన కృషి వెనుక తన భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని, అదే తనను ముందుకు నడిపిస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సంస్ధ ద్వారా ఇప్పుడు 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది మహిళలకు చేయూతనివ్వాలని కోరుకుంటున్న యామిని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, ఆమె కోరుకున్నవన్నీ సాధించాలని మనమూ కోరుకుందాం. 
 
అన్నట్లు యామిని ఎక్కడివారో చెప్పలేదు కదూ. ఆమె జన్మస్థలం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు. బీఎస్సి వరకూ చదివారు. భర్త ఉద్యోగి. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి