తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ తల్లైంది.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది!

మంగళవారం, 8 మార్చి 2016 (16:43 IST)
ముంబైలో పుట్టిన మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ తల్లైంది. ముంబైలోని జంటకు 1986లో పుట్టిన హర్షా చవ్దా షా.. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే.. 30 ఏళ్ల క్రితం హర్షా జన్మించేందుకు ఏ వైద్య బృందం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిని అనుసరించారో... అదే వైద్యుల బృందం ప్రస్తుతం హర్షాకు ప్రసం చేశారు. 
 
హర్షాకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో సిజేరియన్ పద్ధతిలో బాబును బయటికి తీశారు. సరిగ్గా శివరాత్రి రోజున హర్షాకు బాబు పుట్టాడని కుటుంబీకులు తెలిపారు. ఇకపోతే.. హర్షాకు 2015లో దివ్యపాల్ షాతో వివాహమైంది. సహజ పద్ధతిలోనే ఆమె గర్భం దాల్చింది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసింది. 
 
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. టెస్ట్ ట్యూబ్ బేబీగా హర్షని పుట్టించిన తర్వాత తాము 15,000 మంది టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించామన్నారు. హర్ష తల్లికావడం ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీలు సైతం అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడుపగలరనే విషయాన్ని.. సహజ పద్ధతిలోనే గర్భం ధరిస్తారనే సంగతిని లోకానికి ఎత్తిచూపినట్లవుతుందని వైద్యులు చెప్పుకొచ్చారు. హర్షకు పుట్టిన మగబిడ్డ  బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
హర్ష మాట్లాడుతూ 'నేనే ఒక దేవుడి బహుమతిని.. నాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. వాడు నన్ను ఆశీర్వదించడానికి జన్మించాడు. ఈ ఆనందం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు' అని చెప్పింది. పవిత్రమైన శివరాత్రి పర్వదినాన పండంటి బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందన్నారు. శివరాత్రి రోజున తనకు బిడ్డ పుట్టడం స్పెషల్‌ అని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి