డిసెంబరు 18న చెన్నయ్‌లో హ్యాపీ ఉమెన్స్ డే

బుధవారం, 15 డిశెంబరు 2010 (20:04 IST)
జైన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (జిఐడబ్ల్యూఓ) ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో హ్యాపీ ఉమెన్స్ డే వేడుకలు జరుగనున్నాయి. చెన్నయ్‌లోని నెహ్రూ అవుట్‌డోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు యువతులకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని ఈ వేడుకల నిర్వహణ ప్రతినిధులు గనివర్యా నయా పద్మ సాగర్‌జీ మహారాజ్, జేఐడబ్ల్యూఓ ఆర్కిటెక్ట్ సాధ్వీ మయానా శ్రీజీ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హ్యా ఉమెన్స్.. హ్యాపీ వరల్డ్ అనే కాన్సెప్ట్‌తో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇకపై వీటిని ప్రతి యేడాది నిర్వహిస్తామన్నారు. జైన్ ఇంటర్నేషనల్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు అనేక మంది మహిళా ప్రముఖులు హాజరవుతారన్నారు. సమాజంలో మహిళ పాత్ర ప్రశంసనీయమన్నారు. వీరికి ఎక్కడైతే గౌరవరం, సముచిత స్థానం దక్కుతుందో అక్కడ ప్రతిదీ అనుకూలంగా ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా సాధ్వీ మాయానా శ్రీజీ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందుకోసం 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. అలాగే, మహిళలపై జరుగుతున్న దాడులు, గృహ హింస వంటి ఆగడాలను అరికట్టాలంటే ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలన్నారు.

అనంతరం నయా పద్మ సాగర్‌జీ మాట్లాడుతూ తాము నేపాల్ నుంచి పాదరయాత్ర చేస్తూ తమిళనాడుకు వచ్చామన్నారు. ఈ మధ్యలో పలు రాష్ట్రాలను దాటుకుంటూ వచ్చామన్నారు. అయితే, తమిళనాడులో ఉన్నంత భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మిక భావం ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు. అందుకే హ్యాపీ ఉమెన్స్ డే వేడుకలను చెన్నయ్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు.

వెబ్దునియా పై చదవండి