కామన్వెల్త్ గేమ్స్: భారత క్రీడాకారుల పెర్‌ఫార్మెన్స్ భేష్

PTI
దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కామన్వెల్త్ గేమ్స్ 11 రోజులపాటు దిగ్విజయంగా సాగాయి. సొంత గడ్డపై జరిగిన ఈ క్రీడల్లో భారతదేశ ఆటగాళ్లు తమ సత్తాను చాటారు. మొత్తం 101 పతకాలను సాధించి భారతదేశాన్ని రెండో స్థానంలో నిలబెట్టారు. బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ అందించిన చివరి స్వర్ణ పతకంతో భారతదేశం ఇంగ్లండును వెనక్కి నెట్టి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.

భారత్ ఖాతాలో 38 స్వర్ణ, 27 రజత, 36 కాంస్య పతకాలు జమయ్యాయి. ఇక ఆది నుంచి అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియా ఛాంపియన్ అనిపించుకున్నది. ఆసీస్ ఖాతాలో 74 స్వర్ణ, 55 రజత, 48 కాంస్య పతకాలు జమ అయ్యాయి. తృతీయ స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ 37 స్వర్ణ, 59 రజత, 46 కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.

ఇక క్రీడా నిర్వహణ విషయానికి వస్తే... ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న భారతదేశం ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దింది. క్రీడల ప్రారంభమైన దగ్గర్నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని శభాష్ అనిపించుకుంది.

మొత్తమ్మీద కామన్వెల్త్ క్రీడలను విజయవంతంగా నిర్వహించడంతో ప్రారంభానికి ముందు జరిగిన తప్పిదాలు గాలికి కొట్టుక పోయినట్లు అయింది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి