కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 24వ బంగారు పతకం!

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 24వ స్వర్ణ పతకం లభించింది. పురుషుల కుస్తీ పోటీ 74కేజీల విభాగంలో భారత స్టార్ క్రీడాకారుడు నర్సింగ్ యాదవ్‌కు పసిడి పతకం సొంతమైంది. దీంతో భారత్ పురుషుల కుస్తీ పోటీలో తొమ్మిదో స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, భారత్ ఖాతాలో మొత్తం 24 స్వర్ణ పతకాలు చేరినట్లైంది.

74 కేజీల ఫ్రీస్టెయిల్ విభాగం‌లో నర్సింగ్ యాదవ్ బంగారు పతకం సాధించగా, 60కేజీల విభాగంలో యోగేశ్వర్ దత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. కెనడాకు చెందిన జేమ్స్ మనిసిపై యోగేశ్వర్ దత్ గెలుపును నమోదు చేసుకున్నాడు.

ఇకపోతే.. మహిళల 200 మీటర్ల స్విమ్మింగ్ బటర్‌ఫ్లై విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా షిప్పర్ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రెండు సార్లు కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న 26 ఏళ్ల జెస్సికా, కామన్వెల్త్ గేమ్స్‌ చరిత్రలోనే 2:07.04 సెకన్లలో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకుని రికార్డు సృష్టించింది.

వెబ్దునియా పై చదవండి