ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్: రికార్డు సృష్టించిన సోమదేవ్!

PTI
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత యువ సంచలనం సోమదేవ్ దేవ్‌వర్మన్ రికార్డు సృష్టించాడు. కామన్వెల్త్ టెన్నిస్‌లో టాప్ సీడ్ క్రీడాకారుడు సోమదేవ్ దేవ్‌వర్మన్ భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టాడు.

ఆదివారం నాడు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ జోన్స్‌పై వరుస సెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించాడు. దీంతో సోమదేవ్ దేవ్‌వర్మన్‌కు బంగారు పతకం లభించింది. ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించిన సోమదేవ్ దేవ్‌వర్మన్ 6-4, 6-2 తేడాతో జోన్స్‌ను చిత్తుగా ఓడించాడు. ఫలితంగా కామన్వెల్త్ టెన్నిస్ చరిత్రలోనే తొలి స్వర్ణ పతకం సాధించిన భారత టెన్నిస్ ఆటగాడిగా సోమదేవ్ రికార్డు సృష్టించాడు.

మరోవైపు పసిఫిక్ ఐలాండ్‌కు చెందిన సామోస్ ఎలె ఒపెలొజ్ కామన్‌వెల్త్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల 75 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. దీంతో పసిఫిక్ ఐలాండ్‌కు రెండో బంగారు పతకం లభించినట్లయింది. స్నాచ్ విభాగంలో 125 కిలోలు, క్లీన్ జెర్క్ విభాగంలో 160 కిలోల బరువును లేవనెత్తి, మొత్తం 285 కిలోలతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి