#Budget2020 : రైతులకు సోలార్ పంపుసెట్లు - రసాయనాల నుంచి విముక్తి
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:34 IST)
పీఎం కుసుమ్ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకు సోలాప్ పంపు సెట్లను పంపిణీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2020-21 బడ్జెట్‌ను ఆమె శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకుందనీ దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అలాగే, నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకునేందుకు సుమారు 20 లక్షల రైతులకు పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఈవమ్ ఉత్తన్ మహాభియాన్ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజల ఆదాయాన్ని పెంచుతామనీ.. దానికి సంబధించిన చర్యలు తీసుకంటున్నామని తెలిపారు. ఆదాయం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగుతుందన్నారు. దీంతో భారత్‌తో ఉత్పత్తి రంగం కూడా పెరుగుతుందని తద్వారా భారత ఆర్థికాభివృద్ధి మరింతగా పెరుగతుందని అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లను మరింత సరళతరం చేయనున్నామనీ.. వ్యవసాయంలో మరింత పోటీతత్వం పెరగాలన్నారు. సమగ్రమైన పంట విధానాలను అవలంభించాలన్నారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ కూడా అవసరమన్నారు.
అలాగే, తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యాంశం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి. ద్వితీయ ప్రాధాన్యాంశం ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు అని చెప్పారు. మూడో ప్రాధాన్యాంశం విద్య, చిన్నారుల సంక్షేమమని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉన్నామనీ, ప్రధాని ఫసల్ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారిస్తామన్నారు. కృషి సంచాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళత విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. పోలాల ఉత్పాదకత పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ నిపుణులను మరింత సరళీకరించామనీ, పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం చేపడుతామని తెలిపారు.
రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు అందజేస్తామనీ, బీడు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం అందిస్తామని, రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కల్పిస్తామని, భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు రైతులకు సహాయం చేస్తామని విత్తమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.