భారత్‌లో అందుబాటులోకి రానున్న మరో వ్యాక్సిన్

గురువారం, 1 జులై 2021 (12:16 IST)
ప్రస్తుతం భారత్‌లో కరోనా వ్యాక్సిన్లు రెండు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకిరానుంది. మోడెర్నా వ్యాక్సిన్‌ను ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీతో అభివఅద్ధి చేశారు. క్లినికల్‌ ప్రయోగాల్లో వైరస్‌పై 90 శాతానికి పైగా సామర్థ్యం కనబరిచినట్లు సమాచారం. దీంతో అమెరికాతో పాటు పలు దేశాలు ఈ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులను మంజూరు చేసిందికూడా. 
 
ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా యత్నిస్తున్నట్లు సమాచారం. మోడెర్నా వ్యాక్సిన్‌ డోసుల దిగుమతి, మార్కెటింగ్‌ అనుమతుల కోసం ఈ కంపెనీ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డిజిసిఐ)కి సోమవారం దరఖాస్తు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
మోడెర్నా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డిజిసిఐ మంగళవారం అనుమతించింది. కాగా, ప్రస్తుతం మోడెర్నాతో పాటు ఫైజర్‌ టీకా కూడా అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లో విదేశీ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇటీవల డిజిసిఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. 
 
విదేశాల్లో అనుమతులు పొందిన వ్యాక్సిన్‌లకు దేశంలో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే విదేశీ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్న ఇండెమ్నిటీ రక్షణపై కేంద్రం నుండి స్పష్టత రావాల్సి వుండటంతో.. ఈ వ్యాక్సిన్‌ల దిగుమతి ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు