దేశంలో పెరిగిన పాజిటివ్ కేసులు - తగ్గిన మరణాలు

శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:08 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. అదేసమయంలో కరోనా మరణాలు మాత్రం తగ్గాయి. ఇటీవల 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.20 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,727 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
క్రితం రోజు నమోదైన కేసుల(23,529)తో పోలిస్తే దాదాపు 3 వేల కేసులు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటింది. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. అక్కడ నిన్న 15,914 మంది వైరస్‌ బారిన పడగా.. 122 మరణాలు చోటుచేసుకున్నాయి. 
 
మరోవైపు, కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా 277 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు 4,48,339 మందిని వైరస్‌ బలితీసుకుంది. ఇక, మరోసారి కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. 
 
గడిచిన 24 గంటల్లో మరో 28,246 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.30కోట్లు దాటింది. రికవరీ రేటు 97.86శాతానికి చేరింది. అటు క్రియాశీల కేసులు కూడా మరింత తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 2,75,224 మంది కరోనాతో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.82శాతానికి పడిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు