గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధిపత్యానికి గండి

గురువారం, 10 నవంబరు 2016 (19:44 IST)
విజ‌య‌వాడ‌: ఏళ్ళుగా టీడీపీలో ఉన్నా... ఒకే సామాజికవ‌ర్గం అయినా, టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఎదిరించి, ఢీ అంటే ఢీ అన్న ఎమ్మెల్యే కొడాలి నాని. టీడీపీ నుంచి వైదొల‌గుతూ, కొడాలి నాని చంద్ర‌బాబుపై వ్య‌క్తిగ‌తంగా కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ తీర్థం తీసుకుని జ‌గ‌న్ పంచ‌న చేరారు. అప్ప‌టి నుంచి ఆయ‌న్ని ఓడించాల‌ని గుడివాడ‌లో టీడీపీ నేత‌లు ఎన్నోసార్లు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు. అత్య‌ధిక మెజారిటీతో కొడాలినే ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి కొడాలి నానికి ఇపుడు గుడివాడలో భారీ షాక్ తగిలింది. 
 
ఒకవైపు వైసీపీ విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమం చేస్తూ ఉండగానే, గుడివాడ మున్సిపల్ చైర్మన్‌తో సహా 10 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుడివాడ మున్సిపాలిటీ వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో చేరింది. గుడివాడ రాజకీయాలు గతం నుంచి రసవత్తరంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా పేరుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌తో పాటు సీనియర్ నాయకుడు రావి శోభానాధ్రి చౌదరి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 
 
గతంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) కూడా తెలుగుదేశం తరపున ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే రాజకీయాల కారణంగా కొడాలి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ సమీకరణాలు మారాయి. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం వైసీపీ హస్తగతమైంది. అదే సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకుగానూ 21 వార్డుల్లో వైసీపీ, 15 వార్డుల్లో టీడీపీ గెలుపొందాయి. టీడీపీ గెలుపు కోసం విశ్వప్రయత్నం చేసింది. అయితే ఊహించనివిధంగా వైసీపీ మెజారిటీ కౌన్సిలర్లు గెలవడంతో యలవర్తి శ్రీనివాసరావును మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 
 
గతంలో వీరంతా తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన వారే. కేవలం ఎమ్మెల్యే నాని ప్రోద్బలంతో వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ నాని వ్యవహార శైలిలో విసిగిపోయారు. గత ఏడాది కాలంగా నాని వ్యవహారిస్తున్న తీరుతో యలవర్తి, నానికి మధ్య అగాధం పెరిగింది. ఈ నేపథ్యంలోనే గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు 10 మంది కౌన్సిలర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ పరిణామం వైసీపీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ అనే చెప్పాలి.  మున్సిపాలిటీలో 15మంది కౌన్సిలర్ల బలం ఉన్న టీడీపీకి, చైర్మన్‌తో సహా 10 మంది కౌన్సిలర్లు రావడంతో గుడివాడ మున్సిపాలిటీ తెలుగుదేశం పరమైంది.
 
ఇది గుడివాడ వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగుదేశంలోనే రాజకీయ అక్షరాభ్యాసం చేసిన కొడాలి నాని వైసీపీలో చేరడం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించడం, దుర్భాషలాడటం మొదలు పెట్టారు. నాని వ్యాఖ్యలను, అతని వెంట ఉన్న అనుచరులే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీ అంతర్గత రాజకీయం ఒక్కసారిగా బద్దలైంది. ఇంతకాలం ఎమ్మెల్యే కొడాలి నానికి కుడిభుజంగా ఉన్న యలవర్తి శ్రీనివాసరావు వర్గం టీడీపీలో చేరడంతో వైసీపీ కంటే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే నానికి ఇది గట్టి దెబ్బనే చెప్పాలి. గత 3 రోజులుగా యలవర్తి టీమ్ టీడీపీలో చేరుతుందన్న ప్రచారం తీవ్రమవడంతో నాని గుడివాడలోనే మకాం వేసి యలవర్తి వెంట కౌన్సిలర్లు ఎవరు వెళ్లకుండా నిలువరించేందుకు శతవిధాలా  ప్రయత్నించారు. ఒక దశలో అయితే ఎమ్మెల్యే నాని టీడీపీకి మొగ్గు చూపుతున్న కౌన్సిలర్లకు ఆర్థికంగా ఆశపెట్టచూపబోయారు.  అయినప్పటికీ నాని అనుచరులుగా ముద్రపడిన కౌన్సిలర్లు, నాని మాటను కాదని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
రాబోయే రాజకీయ పరిణామాలు ఏలా ఉండబోతున్నాయి
గుడివాడ నియోజకవర్గంలో రాబోయేరోజుల్లో రాజకీయ పరిణామాలు మారబోతున్నయనే దానికి ఇదే సంకేతం. నానిని ఢీకొనేందుకు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహారించే పార్టీ నాయకులంతా ఒకతాటిపైకి రాబోతున్నారు. ఎమ్మెల్యే నాని ఆధిపత్యానికి గుడివాడలో చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీలోని రావి వర్గీయులు, పిన్నమనేని వర్గీయులు, దీంతోపాటు టీడీపీకి గట్టి పట్టున్న మండలాల్లో క్రింది స్థాయి యంత్రాంగంతో కలిసి వ్యూహ‌ రచని చేస్తున్నారు. 
 
నానిని రాజకీయంగా దెబ్బకొట్టాలంటే ముందుగా అతని అనుచరగణాన్ని అతని నుంచి దూరం చేయాలి. ఇప్పటివరకు అతనికి ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేస్తున్న వ్యక్తులను కూడా టీడీపీ వైపు తిప్పుకోవాలి. ఈ రెండు చేసేందుకు టీడీపీ ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వేసుకుంది. ముందుముందు రాజకీయంగా కూడా కీలకంగా మారి 2019 నాటికి టీడీపీ జెండాను గుడివాడలో ఎగరవేయడమే లక్ష్యంగా వ్యూహత్మకంగా వ్యవహారించబోతోంది.

వెబ్దునియా పై చదవండి