122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో జరిగిన బలనిరూపణలో ముఖ్యమంత్రి పళణిస్వామి సర్కారు గెలిస్తే.. రాష్ట్రపతి పాలన వస్తుందంటారేంటి.. అనుకుంటున్నారా... ప్రస్తుతం రాష్ట్రపతి పాలన వైపే తమిళనాడు రాజకీయాలు అడుగులు పడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన రచ్చపై ఇప్పటికే ఆయన ఒక నివేదికను కూడా తయారుచేసి కేంద్రానికి కూడా పంపించారట. ఇక ఈ నివేదికను కేంద్రం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. చిన్నమ్మ పడిన కష్టం, పన్నీరు సెల్వం, స్టాలిన్ వ్యూహాలన్నీ మట్టిలో కలిసిపోయినట్లే. అసలు ఎందుకు రాష్ట్రపతి పాలన వస్తుందంటారా.. అయితే ఇది చూడండి.
అన్నాడిఎంకే... అప్పట్లో ఎం.జి.ఆర్.పార్టీని స్థాపించిన సమయంలో ఒక వెలుగు వెలిగిన పార్టీ. ఆయన మరణానంతరం పార్టీకి దిక్కే లేదు. ఇక ప్రభుత్వం ఉండాలంటే ఎవరో ఒకరిని నిలబెట్టాలని ఎం.జి.ఆర్.భార్య జానకిని నిలబెట్టారు. శాసనసభలో బలనిరూపణ. సానుభూతితో సొంత పార్టీలోని వారు ఆమెను ఎన్నుకున్నారు. అయితే ప్రతిపక్షపార్టీ ఒప్పుకోలేదు. శాసనసభలో గందరగోళం చేసింది. గత కొన్నిరోజుల ముందు శాసనసభలో జరిగిన రాద్ధాంతమే అక్కడా జరిగింది. బలనిరూపణలో జానకి గెలిచినా చివరకు గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికతో రాష్ట్రపతి పాలన వచ్చేసింది. ఇంకేముంది ఎమ్మెల్యేలందరూ డీలా పడిపోయారు. అది అప్పట్లో జరిగింది.
ప్రస్తుతం కూడా తమిళనాడు శాసనసభలో ఇదే సీన్ రిపీట్ అయింది. జయలలిత మరణం తరువాత ఆ పీఠాన్ని ఎక్కాలని శశికళ కలలు కన్నారు. అయితే అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్ళడంతో పళణిస్వామికి అవకాశం వచ్చింది. అయితే శాసనసభలో గొడవ మాత్రం అదే స్థాయిలో జరిగింది. స్పీకర్ ధనపాల్‌ను నెట్టేయడం, కాగితాలు చించేయడం, మైకు లాక్కోవడం, స్పీకర్ ఛైర్‌లోనే కూర్చోవడం ఇలా ఒకటి కాదు... ఎన్నో జరిగాయి. ఈ గందరగోళంలో పళణిస్వామి గెలిచినా చివరకు ప్రతిపక్షాలు, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మాత్రం గవర్నర్‌ను కలిశారు. శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండానే ఓటింగ్ నిర్వహించారు.
గవర్నర్‌కు ప్రస్తుతం కత్తిమీద సామే. ఇన్ని రోజులుగా బలనిరూపణ జరగలేదని అనుకుంటుంటే ఇప్పుడు బలనిరూపణ జరిగినా దానిపై ఆలోచించాలని, దీంతో న్యాయ నిపుణుల సలహాల కోసం మళ్ళీ విద్యాసాగర్ రావు మొదటికే వచ్చారు. అయితే ప్రస్తుతానికి నివేదిక మాత్రం తయారుచేసి కేంద్రానికి పంపించారని వార్తలు వస్తున్నాయి. ఆ నివేదిక ప్రకారం తమిళనాడులో రాష్ట్రపతి పాలన వస్తుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని, కాబట్టి రాష్ట్రపతి పాలనే మంచిదని ఆయన అభిప్రాయానికి వచ్చారట. న్యాయనిపుణులు కూడా అదే చెప్పారట మరి. ఇక మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోకతప్పదు. ఇప్పటికే శశికళపై కోపంతో ఉన్న ప్రధాని మోడీకి ఇదొక అవకాశం. మోడీ అనుకుంటే రాష్ట్రపతి పాలన క్షణాల్లో జరిగిపోతుంది. అదే జరిగితే ఇక శశికళకు పెద్ద దెబ్బే.