అమ్మ పోలికలు మినహా మీ అర్హతేంటి దీపమ్మా... నీ భర్తే నిన్ను ఛీకొట్టారంటూ రజనీ ఫ్యాన్స్ దెప్పిపొడుపులు

బుధవారం, 24 మే 2017 (12:21 IST)
వెయిటింగ్ అయిపోయింది. దేవుడు శాసించేసాడు.. ఇక రాజకీయరంగంలో యుద్ధానికి సిద్ధం కావడమేనంటూ సూపర్‌స్టార్ కత్తి సానపెట్టే పనిలో ఉండగానే ఇతర రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆయనపై మాటల కత్తులతో దాడి చేసేసాయి. రజనీని రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నామంటూ ప్రముఖ పార్టీల్లోని పెద్దలు మీడియా ముందు చెప్తున్నా, ఆ పార్టీల క్షేత్రస్థాయి సిబ్బంది, మరికొన్ని సంఘాలు రజనీ ఎంట్రీకి అడుగడుగునా ఇబ్బందులు కల్పించే పనిలో పడ్డాయి.
 
మహారాష్ట్రీయునిగా జన్మించి, కన్నడిగుడిగా పెరిగి, దర్శక దిగ్గజం బాలచందర్ శిష్యరికంలో తమిళనాడులో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీపై ముందుగా స్థానికతను అంశాన్ని లేవనెత్తి పబ్బం గడుపుకోవాలన్న వ్యతిరేకులు రజనీ అభిమానుల నుండి ఎదురైన తీవ్ర నిరసనలతో ఒక రకంగా వెనక్కు తగ్గారనే చెప్పుకోవాలి. వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడని నేటి రాజకీయ నేతలు ఇప్పుడు ఆయన జీవితంలోని చీకటి కోణాలపై దృష్టి సారించాయి. 
 
ఆరోగ్య, ఆధ్యాత్మిక కారణాలతో గత కొన్నేళ్లుగా వివాదాలకు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉంటూ వస్తున్న రజనీకాంత్‌పై ప్రస్తుత వ్యక్తిగత జీవితం సైతం ఎలాంటి మచ్చలు లేకుండా ఉండటంతో జల్లికట్టు సమయంలో సంఘీభావం ప్రకటించకపోవడం, కావేరి నదీజలాలు, వరద బాధితులకు సహాయం చేయకపోవడం వంటి ఇతర సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు. అందులో భాగంగా రజనీకాంత్ సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తాగిన మైకంలో బీభత్సం సృష్టించి, అరెస్టయిన విషయాన్ని వెలుగులోకి తెస్తూ, ఆ పేపర్ కటింగ్‌కు సోషల్ మీడియాలో ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
 
తాజాగా ఎంజీఆర్ అమ్మ దీప పేరవై నాయకురాలు, దివంగత మాజీ సిఎం జయలలిలత మేనకోడలు అయిన దీప సైతం రజనీపై మాటల దాడి చేసారు. సినిమా రంగంలోనే బోలెడు సమస్యలున్నాయని, ముందుగా వాటిని చక్కదిద్దమని ఓ ఉచిత సలహా కూడా రజనీకి ఇచ్చిన దీప, అసలు రజనీకి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. రాష్ట్రప్రజలందరి తరపున వకాల్తా పుచ్చుకున్న దీప తమిళనాడులోని ప్రజలందరూ ఆయన రాజకీయ ప్రవేశం పట్ల అసంతృప్తితో ఉన్నారని సెలవిచ్చారు. 
 
ఈమె వ్యాఖ్యలకు రజనీ అభిమానులు సైతం అంతే ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు... జయలలిత పోలికలు ఉండటం, ఆమెకు మేనకోడలు కావడం తప్ప దీపకు ఉన్న అర్హతలేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా, ఆమె భర్తే ఆమెను ఛీకొట్టి మరో కొత్త పార్టీని స్థాపించారంటూ వారు గుర్తు చేస్తున్నారు. పైగా, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తమ నాయకుడు వెనుకడుగు వేయడని, రాజకీయ ప్రవేశం గ్యారెంటీ అని ఢంకా బజాయిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి