తరుణ్ సరసన 'పోకిరి' భామ

మంగళవారం, 9 అక్టోబరు 2007 (11:40 IST)
FileFILE
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు వెల్లువలా వస్తున్న హీరోయిన్లలో ఇలియానా ఒకరు. అయితే.. వచ్చిన అవకాశాలను అంగీకరించేందుకు ఆమె ససేమిరా అనండంతో తెలుగుకు స్వస్తి పలికినట్టేనని కొందరు భావించారు. దీంతో ఇలియానా కల్పించుకుని, తనకు ఓ ఇమేజ్‌ను, గుర్తింపును ఇచ్చిన తెలుగు పరిశ్రమను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో యువహీరో తరుణ్‌తో ఓ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం కథ నచ్చడంతో యువ హీరోతో సీనియర్ నటుడు నటించేందుకు అంగీకరించారని వినికిడి.

అలాగే.. ఇలియానా కూడా చిత్ర కథ నచ్చడంతో అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. లోగడ విజయభాస్కర్-తరుణ్ కాంబినేషన్‌లో 'నువ్వే నువ్వే' చిత్రం వచ్చింది. తాజాగా నిర్మించనున్న చిత్రం షూటింగ్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

వెబ్దునియా పై చదవండి