సూరి హత్య కేసు టాలీవుడ్ అగ్రనిర్మాతల మెడకు చుట్టుకుంటోంది. ప్రముఖ ఫైనాన్సియర్ వైజయంతిరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదుతో దీనికి మరింత బలాన్నిస్తోంది. 2009లో అగ్రనిర్మాతగా పేరుగాంచిన శింగమనల రమేష్ ఓ సినిమాకోసం వైజయంతి రెడ్డి వద్ద ఓ భూమిని కుదవబెట్టి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వైజయంతి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత వైజయంతి తన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా అడిగితే... తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హత్య చేస్తామని సూరి హత్యకేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న భాను, నిర్మాత రమేష్ ఇద్దరూ బెదిరించారని వైజయంతి చెప్పుకొచ్చారు.
సూరి హత్యానంతరం వైజయంతి రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. మొత్తమ్మీద సూరి హత్య వ్యవహారం టాలీవుడ్‌లో అగ్రస్థానంలో వెలుగొందుతున్న నిర్మాతల మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది.