అవార్డుల్లో కొన్ని తేడాలుండవచ్చు... హైలెట్ చేయొద్దు... అక్కినేని

గురువారం, 18 ఏప్రియల్ 2013 (20:41 IST)
WD
టి.సుబ్బరామిరెడ్డి, టీవీ9 నేషనల్‌ ఫిలిం అవార్డుల ప్రదానం ఈనెల 20వ తేదీన శిల్పకళావేదికలో ప్రదానం చేయనున్నట్లు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. గురువారంనాడు ఆయన మీడియాతో ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ... అవార్డుల ప్రకనటలో కొన్ని తేడాలుండవచ్చు. వాటిని హైలైట్‌ చేసుకోవద్దని... ఎక్కడైనా కొన్ని తప్పులు జరుగతాయని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. స్వార్థ, ప్రత్యేకదృష్టి లేకుండా సమిష్టిగా ఈ అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. అవార్డులను ఇవ్వడంలో మనం చాలా వెనుకబడి ఉన్నామని తెలిపారు. అవార్డు ఇవ్వాలంటే డబ్బే కాకుండా కళాదృష్టి ఉండాలని అది సుబ్బరామిరెడ్డి వంటి వ్యక్తులకే ఉందని ఆయన అన్నారు. సుశీల మాట్లాడుతూ.. అక్కినేని నటించిన 'కన్నతల్లి'లో తొలిసారిగా పాడాననీ, ఇప్పుడు ఆయన సమక్షంలో కమిటీ సభ్యురాలైనందుకు సంతోషంగా ఉందన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి అవార్డులను ప్రకటించారు. 2011 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (శ్రీరామరాజ్యం), ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్‌ (బద్రినాథ్‌), ఉత్తమనటిగా తాప్సీ (మొగుడు), ఉత్తమ కథానాయికగా తమన్నా (100%లవ్‌), దర్శకుడిగా శ్రీనువైట్ల (దూకుడు), నిర్మాతగా యలమంచిలి సాయిబాబా(శ్రీరామరాజ్యం), సపోర్ట్‌ ఆర్టిస్టు ప్రకాష్‌రాజ్‌ (దూకుడు), కమేడియన్‌ బ్రహ్మానందం (దూకుడు), క్యారెక్టర్‌ నటిగా సన (వీడింతే), సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌ (దూకుడు), ప్లేబ్యాక్‌ సింగర్‌ కార్తీక్‌ (మొగుడు), గాయనిగా రమ్య (దూకుడు), నెగెటివ్‌రోల్‌ మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), స్పెషల్‌ జ్యూరీఅ వార్డు ఛార్మి (మంగళ), రాంకీ (గంగపుత్రులు) ఎంపికయ్యారు.

ఇది కాకుండా స్పెషల్‌ జ్యూరీ అవార్డు కేటగిరిలో నిర్మాత, నటుడిగా నాగార్జున, నటిగా స్నేహ, బాలనటిగా బేబే ఆనీ ఎంపికయ్యారు.

2012కు గాను ఉత్తమ నటుడిగా నాగార్జు (శిరీడీసాయి), హీరోగా రామ్‌ చరణ్‌ (రచ్చ), నటిగా సమంత (ఈగ), హీరోయిన్‌గా అనుష్క (డమరుకం), దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ (బిజినెస్‌మేన్‌), నిర్మాతగా మహేష్‌ రెడ్డి (శిరిడీసాయి), క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కోట శ్రీనివాసరావు (కృష్ణం వందే జగద్గురుమ్), కమేడియన్‌గా బ్రహ్మానందం (దేనికైనా రెడీ), నటిగా సురేఖావాణి (దేనికైనా రెడీ), సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్‌ (డమరుకం), ప్లేబ్యాక్‌ సింగర్‌గా వడ్డేపల్లి శ్రీనివాస్‌ (గబ్బర్‌సింగ్‌ ..ఏ పిల్ల.., గాయనిగా కౌసల్య (శిరిడీ సాయి.. సాయి..సాయి..) ఎంపిక చేశారు. ఇవికాక.. స్పెషల్‌ జ్యూరీ అవార్డుల క్రింద 11మందిని ఎంపిక చేశారు.

ఇక హిందీ రంగానికి 12 అవార్డులను ఎంపిక చేశారు. అందులో శ్రీదేవి, బోనీకపూర్‌, అనిల్‌ కపూర్‌, శత్రుఘ్నసిన్హా, జీనత్‌ అమన్‌, రాణీముఖర్జీ, అమీషా పటేల్‌, రవీనా టాండన్‌, దియామీర్జా, గుల్షన్‌ గ్రోవర్‌, ముఖేష్‌ రుషి, అల్కా యాగ్నిక్‌ ఉన్నారు. ఇవి కాకుండా తమిళ రంగానికి సిల్వర్‌స్క్రీన్‌ సెన్షేనల్‌ అవార్డు క్రింద అర్జున్‌, లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు రాధిక, శరత్‌కుమార్‌లు ఉన్నారు. కన్నడలో ఉత్తమనటిగా ప్రియమణి, స్పెషల్‌ జ్యూరీకి కృష్ణన్‌ శ్రీకాంత్‌ ఎంపికయ్యారు. మలయాళంలో స్పెషల్‌ జ్యూరీ అవార్డు క్రింద శోభనను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డుల ఎంపిక టీవీ9 ద్వారా వచ్చిన ఎస్‌ఎం.ఎస్‌.ల ద్వారా ఎంపిక చేసి వాటిని మా కమిటీ సభ్యులైన నాగేశ్వరరావు, సుశీల, డా. డి.రామానాయుడు, జయసుధ ఆధ్వర్యంలో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేశామని తెలిపారు. ఈ అవార్డులను వివిధ రంగాల్లో విశిష్టమైన వ్యక్తుల చేత ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి