జేఏసి చైర్మెన్ కోదండరాం క్లాప్‌తో ''జయహో తెలంగాణా ''

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (21:24 IST)
''వీరనారి చాకలి ఐలమ్మ '' వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన మిరియాల రవికుమార్ తాజాగా రూపొందిస్తున్న చిత్రం ''జయహో తెలంగాణా ''. మహేశ్వరి సమర్పణలో ప్రేమ్ మూవీస్ పతాకంపై మిరియాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్ బాబు నిర్మిస్తున్నారు. మార్త రఘుపతి గౌడ్, నడిగొట్టు శంకర్ సహ నిర్మాతలు. నటుడు సుమన్, పలువురు జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణా జే ఏ సి చైర్మెన్ ప్రోఫేసర్ కోదండరామ్ క్లాప్ ఇచ్చారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మిరియాల రవి కుమార్ మాట్లాడుతూ ''ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తెలంగాణా ఉద్యమం, వందలాదిమంది యువకుల బలిదానాల త్యాగఫలంతో ఏర్పడిన తెలంగాణా విశిష్టతే మా ''జయహో తెలంగాణా '' అని అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన తర్వాత చేస్తున్న ఈ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను తప్పకుండా తెలంగాణా ప్రజలను అలరించేలా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.

ప్రోఫెసర్ టి జె ఏ సి చైర్మెన్ కోదండరామ్ మాట్లాడుతూ ''తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూపొందుతున్న ఈ చిత్రం తెలంగాణా ప్రజల మనసులను గెలుస్తుందని నమ్ముతున్నాను. తెలంగాణాలో ఎంతైనా సినిమా కళాకారులు తక్కువే అందుకే రాబోయే కొత్త ప్రభుత్వాన్ని కళాకారులను, సాంకేతిక నిపుణులను అందించే ఓ ఫిలిం ఇనిస్టిట్యూట్ ని నెలకొల్పేలా చర్యలు తీసుకోమని కోరనున్నాం. అలా చేయడం వల్ల ఒక్క తెలంగాణాలోనే కాకుండా సీమాంద్ర ప్రాంతం లోని కింది స్థాయి వర్గాలు కూడా ఎదిగే అవకాశం ఉందని అన్నారు.

మే నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో ఇంద్ర, రాజీవ్ కుమార్‌లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. ప్రీతి నిగమ్, మధుబాల, సుమనశ్రీ, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. కెమెరా: గిరి, కో -డైరెక్టర్: మువ్వా, సంగీతం: రమేష్ ముక్కెర, సహ నిర్మాతలు: మార్త రఘుపతి గౌడ్, నడిగొట్టు శంకర్, నిర్మాత : కొత్తపల్లి సతీష్ బాబు, కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : మిరియాల రవికుమార్.

వెబ్దునియా పై చదవండి