ఆ పెళ్ళికి పిలవండి.. నేను కూడా వస్తా: నిఖిత

WD PhotoWD
ఇ.వి.వి సత్యనారాయణ కుమారుడి ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయం అవుతున్న "హాయ్" అనే చిత్రంలో పలుకరించిన నటి నిఖిత. ఆమె నవ్వులో ప్రత్యేకత ఉంది. పన్నెండేళ్ల వయస్సులోనే ఏవో గీతాలను రాసి ఇంట్లోవారి చేత రచయిత్రిగా ముద్రవేసుకుంది. ఆ మధ్య కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. "సంబరం", ఖుషీ ఖుషీగా, "ఏమండోయ్ శ్రీవారు", "నీ నవ్వేచాలు" వంటి చిత్రాల్లో నటించిన నిఖిత... ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుంది. లేటెస్ట్‌గా నటి రాశి సమర్పిస్తోన్న చిత్రంలో రిషి సరసన నటిస్తోంది. హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నిఖితతో కాసేపు...

ప్రశ్న: తెలుగులో గ్యాప్ రావడానికి బలమైన కారణం ఉందా?
జ: బలమైన కారణాలు ఏమీలేవు. గ్యాప్ అనేది లేదు. తమిళం, మలయాళం, కన్నడ ఇలా పలు చిత్రాల్లో చేస్తున్నాను. దాదాపు 19 చిత్రాలు పూర్తిచేశాను. దాని వల్ల తెలుగులో విరామం అనిపించవచ్చు.

ప్రశ్న: మీ గురించి వివరిస్తారా?
జ: నా పేరు నిఖిత. ఇది రష్యన్ పేరు. మా నాన్న పెట్టారు. నాకు ఇద్దరు చెల్లెల్లు. ఒక సోదరుడు. నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి. నేను ఎం.ఎ. ఎకనామిక్స్ ఫస్ట్‌ఇయర్ పూర్తి చేశాను. తక్కిన రెండేళ్లు కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న: దక్షిణాది చిత్రాలన్నింటిలో చేస్తున్నారు? మీ నివాసం ఎక్కడ?
జ: ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను. నాకు గైడెన్స్ ఎవరూ లేరు. సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాలను నేనే చూసుకుంటాను.

ప్రశ్న: ప్రస్తుతం చేస్తున్న చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
జ: ప్రముఖ నటి రాశి భర్త శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. హీరో రిషి. పాత్ర పరంగా చూస్తే, నాది అమాయకత్వంలో కూడిన పాత్ర. ఇదిమంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను.

ప్రశ్న: ఈ పోటీ యుగంలో మీ కెరీర్‌ను ఎలా డెవలప్ చేసుకుంటున్నారు?
జ: దక్షిణాదిలోని అన్నీ భాషల్లోనూ ఎందరో కొత్త అమ్మాయిలు వస్తున్నారు. ముఖ్యంగా ముంబై నుంచే ఎక్కువమంది ఉన్నారు. అయితే నా ఫెర్‌ఫార్మెన్స్, ప్రవర్తనతో ఇక్కడ నాకొక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను. నాపై నాకు నమ్మకం ఉంది. నాకు స్వాగతం పలికినట్లే కొత్తవాళ్ళనూ నేను స్వాగతిస్తాను. ఎవరి టాలెంట్ వారిది.

ప్రశ్న: మీ పాత్రలు ఎలా ఉండాలనుకుంటున్నారు?
జ: భవిష్యత్తులో గృహిణి అయ్యాక పిల్లవు కూడా నేను చేసిన సినిమాల గురించి చెప్పుకొనేట్లు ఉండాలి. ఒక శ్రీదేవి, జయప్రద, సౌందర్య వంటి నటీమణులు నటించి గుర్తుండిపోయే పాత్రలు.

ప్రశ్న: ప్రేమకు మీరిచ్చే నిర్వచనం?
జ: ప్రేమంటే చాలా ఇష్టం. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడక తప్పదనేది నా అభిప్రాయం.

ప్రశ్న: మీరెటువంటి వివాహం చేసుకుంటారు?
జ: ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను. పెద్దలు నిర్ణయించిందా ప్రేమ పెళ్ళా అనేది. ప్రస్తుతానికి నా మనస్సులో ఏమీ లేదు.

ప్రశ్న: ఈ మధ్య మీరెవరినో పెండ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి?
జ: (నవ్వేస్తూ...) అరె... ఇంతవరకు నాకేం తెలియదు. నాకు తెలీయకుండా నా పెండ్లి జరిపేస్తున్నారా... అయితే ఆ పెళ్లికి నన్ను కూడా పిలవండి తప్పకుండా వస్తా...

ప్రశ్న: కవిత్వం ఇంటి వరకేనా?
జ: లేదండీ నేను ఇంగ్లీషులో పొయిట్రీ రాశాను. వాటిని ఒక బుక్‌లెట్‌గా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను.

వెబ్దునియా పై చదవండి